డేటింగ్కు వెళ్లి.. 14 అంతస్తులపై నుంచి పడి..
న్యూజిలాండ్: ఎప్పుడూ మనచుట్టూ ఉండేవాళ్లనే పూర్తిగా నమ్మలేకుండా ఉన్న నేటి పరిస్థితిలో కొంతమంది కొత్త సంబంధాలను చీకట్లో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో దెబ్బతిని అర్ధాంతరంగా ప్రాణాలుకోల్పోతున్నారు. అందుకు ఉదాహరణగా నిలిచింది ఈ న్యూజిలాండ్కు చెందిన అమ్మాయి కథనం. ఆమె పేరు వారియెనా రైట్. వయసు 26 ఏళ్లు. అతడేమో ఆస్ట్రేలియాకు చెందినవాడు. పేరు గాబెల్ టోస్టీ(30). ఇద్దరు టిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. వారి మధ్య గంటలకొద్ది గడిచిన చాటింగ్ కాస్త.. డేటింగ్ వరకు దారి తీసింది.
అయితే, అతడిని నమ్మి టూర్ పేరుతో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ సిటీకి వచ్చిన రైట్ అక్కడ ఉన్న గాబెల్ ప్లాట్కు వెళ్లింది. ఈ సంఘటన 2014 ఆగస్టు 8న జరిగింది. అయితే, ఆరోజు తొలుత బాగానే ఉన్న అతడు ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది కాస్త వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. అతడిని తప్పించుకునేందుకు ఇంట్లో వస్తువులు గాబెల్ పై విసిరింది. ఆమెపై చేయి చేసుకొని తన ఇంటి బాల్కనీలో పెట్టి తాళం వేస్తానని బెదిరించాడు.
దీంతో మరింత బయపడిని రైట్ తనను ఇంటికి వెళ్లనివ్వాలని ఎంతో ప్రాధేయపడింది. అనంతరం అతడి నుంచి తప్పించుకునే దారిలేక కిటికీలో నుంచి కిందికి దిగే ప్రయత్నం చేస్తూ ఏకంగా పద్నాలుగు అంతస్తుల మీద నుంచి జారికిందపడి ప్రాణాలుకోల్పోయింది. అప్పుడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజాగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. గాబెల్ ను కోర్టు దోషిగా ప్రకటించే అవకాశం ఉంది. తానేం ఆమెను కిందికి తోసివేయలేదని గాబెల్ న్యాయమూర్తితో చెబుతున్నాడు. సోమవారం తర్వాత జడ్జి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.