ఈ ఏసీ చాలా చాలా చౌక!
మట్టి కుండ పేదవాడి ఫ్రిడ్జ్ అంటుంటారు. భగభగ మండే ఎండల్లో సైతం పైసా ఖర్చు లేకుండా చల్లటి నీళ్లతో గొంతు తడిపేది ఇదే. అయితే, ఇప్పుడు ఇదే మట్టికుండ గది ఉష్ణోగ్రతలను చల్లబరిచే ఎయిర్ కండిషనర్‌గానూ ఉపయోగపడుతుందని అంటున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన డిజైనర్ దిబాల్ట్ ఫావెరీ. ఈయన ఒక చిన్న టైట పాత్ర, అల్యూమినియం సామాగ్రి, చిన్న బ్లోయర్ సాయంతో అత్యంత తక్కువ ఖర్చులో ఏసీని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది అదే. నీరు ఆవిరయ్యే క్రమంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న సాధారణ భౌతికశాస్త్ర సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఇది.
పొడవాటి మట్టిపాత్ర.... లోపలిభాగంలో ఓ అల్యూమినియం గొట్టం... దాంట్లో వరుసగా అల్యూమినియంతో చేసిన చక్రాలు ఉంటాయి. మట్టిపాత్రకు, అల్యూమినియం గొట్టానికి మధ్యభాగంలో నీరు ఉంటుంది. మట్టిపాత్ర అడుగుభాగంలో ఉన్న రంధ్రం నుంచి బయటి గాలి లోపలికి వస్తుంది. బ్లోయర్ గాలిని పైకి పంపిస్తుంటుంది. అప్పటికే చల్లబడ్డ నీరు కాస్తా ఆవిరిగా మారి అల్యూమినియం గొట్టంపైభాగం ద్వారా బయటకు వస్తుందన్నమాట. గది ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ గాలి ఉష్ణోగ్రత కనీసం 8 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకూ తక్కువ ఉంటుంది. మట్టిపాత్రకు రూ.100, అల్యూమినియం గొట్టానికి, చక్రాలకు, బ్లోయర్‌కు కలిపి మరో రూ.300 అనుకున్నా మొత్తమ్మీద రూ.400లకే ఓ చిన్న ఏసీ వచ్చేస్తుంది.