Air condition
-
ఏసీలతో పవర్ గ్రిడ్లకు ముప్పు!
సాక్షి, అమరావతి: ఒకప్పుడు విలాస వస్తువుగా కనిపించిన ఎయిర్ కండిషన్లు(ఏసీలు).. ఇప్పుడు విపరీత ఎండలతో తప్పనిసరి అవసరంగా మారిపోతున్నాయి. గతంలో సంపన్నులకే పరిమితమైన ఏసీలు.. ఇప్పుడు సామాన్యులకు చేరువవుతున్నాయి. ఈ క్రమంలో అవగాహన లేమి, అనవసర వృథా అనర్థాలకు దారితీస్తోంది. ఏసీల అతి వినియోగం వల్ల పవర్ గ్రిడ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) హెచ్చరించింది. రానున్న రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో పాటు పట్టణ జనాభా కూడా భారీగా వృద్ధి చెంది.. ఏసీల వాడకాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాయని పేర్కొంది. దీంతో పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఐఈఏ తన తాజా నివేదికలో వెల్లడించింది.ప్రతి వందలో 24 ఇళ్లకు ఏసీ..దేశవ్యాప్తంగా ప్రతి 100 ఇళ్లల్లో 24 ఇళ్లకు ఏసీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఇటీవల వెల్లడించింది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం గత 50 ఏళ్లలో 17 వేల మంది ఎండ దెబ్బకు మరణించారు. విపరీత ఎండలతో భవనాల నుంచి రేకుల షెడ్డు వరకూ ఏసీలను వినియోగిస్తున్నారని పేర్కొంది. ఫలితంగా ఏసీలకు వాడే విద్యుత్ వినియోగం.. మొత్తం విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 20 శాతానికి చేరింది. 2050 నాటికి దేశంలో పట్టణ జనాభా సంఖ్య 40 కోట్లకు పైగా చేరనుందని అంచనా. దీంతో అప్పటికల్లా పట్టణాల్లో విద్యుత్ డిమాండ్ నాలుగు రెట్లు పెరగనుందని.. గృహాల్లో ఏసీల వాడకం తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా.ఇది మొత్తం ఆఫ్రికా ఖండంలో విద్యుత్ వినియోగం కంటే ఎక్కువ. ఏసీలకు ఇలా డిమాండ్ పెరగడం వల్ల విద్యుత్ లోటు ఏర్పడి.. కోతలు విధించాల్సిన అవసరం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఏపీలో ఏసీలకు 3 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్..ఏసీలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వినియోగించడం ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తాజా అధ్యయనంలో వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ టన్నుల రిఫ్రిజిరేషన్(టీఆర్) ఎయిర్ కండీషనర్ సామర్థ్యం ఉంది. ఇది 10 ఏళ్లలో దాదాపు 250 మిలియన్ టీఆర్‌కు చేరుకునే ప్రమాదం ఉంది. దీని వల్ల 2030 నాటికి దేశంలో విద్యుత్ లోడ్ సుమారు 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఏసీల విద్యుత్ డిమాండ్ ఏటా దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతం. వినియోగదారులు ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌గా పెట్టుకుంటే.. దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని బీఈఈ నివేదికలో పేర్కొంది.ఏసీ ఎక్కువైనా అనర్థమే..ఒక మనిషి 1.5 టన్నుల ఏసీని ఉపయోగిస్తే.. అది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్‌ను వినియోగించి.. దాదాపు 0.98 కిలోల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 36–37 డిగ్రీల సెల్సియస్. కానీ 18–21 డిగ్రీల సెల్సియస్‌కు ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, కళ్లు, చర్మం పొడిబారడం, రక్తపోటు వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
హీటింగ్, వెంటిలేషన్, ఏసీలకు డిమాండ్
నోయిడా: మౌలికరంగ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తుండడంతో రానున్న రోజుల్లో హీటింగ్, వెంటిలేషన్, ఏసీ (హెచ్‌వీఏసీ) రంగానికి అసాధారణ వృద్ధి అవకాశాలు రానున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మౌలిక రంగానికి 2024–25 మధ్యంతర బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం తెలిసిందే. యాక్రెక్స్ ఇండియా 23వ ఎడిషన్ కార్యక్రమం సందర్భంగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై 1.45 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేయనుండడంతో అసాధారణ వృద్ధికి అవకాశాలున్నట్టు హెచ్‌వీఏసీ పరిశ్రమ మండలి ‘ఐఎస్హెచ్ఆర్ఏఈ’ ప్రెసిడెంట్ యోగేష్ ఠాకూర్ తెలిపారు. సీ, రిఫ్రిజిరేషన్ రంగంలో పర్యావరణ అనుకూల విధానాల అమలుకు ఈ కార్యక్రమ తోడ్పడుతుందని ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ పేర్కొన్నారు. ఐఎస్హెచ్ఆర్ఏఈ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనూప్ బల్లే మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గింపునకు, నైపుణ్యాల అభివృద్ధికి పరిశ్రమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 2030 నాటికి 10 లక్షల జనాభాను మించిన పట్టణాలు 42 నుంచి 68కి పెరుగుతాయని, ఇది సీ సిస్టమ్‌లకు డిమాండ్‌ను పెంచుతుందని క్యారియల్ ఇండియా ఎండీ సంజయ్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ వంటి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రస్తుతం దేశ ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ రంగం 9 బిలియన్ డాలర్ల మేర ఉన్నట్టు వోల్టాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకందన్ మీనన్ పేర్కొన్నారు. -
డైకిన్ ఏసీలు..మేడిన్ ఆంధ్రా
-
రైల్వే ఏసీలో కొత్త గాలి..
న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఏసీ రైళ్లలోని పంపింప్ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నారు. బోగీలో ఉండే గాలిని తరచూ మార్చేలా సరికొత్త వ్యవస్థను అమర్చనున్నారు. దీంతో కొత్త గాలి ప్రవేశించి కరోనా వ్యాప్తిని అరికడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలో గంటకు ఆరు నుంచి ఎనిమిది సార్లు మాత్రమే కొత్తగాలి బోగీలో ప్రవేశించేది. అందులో 80 శాతం గాలి అక్కడే తిరుగుతుండగా కేవలం 20 శాతం కొత్త గాలి ప్రవేశించేది. అయితే కొత్త వ్యవస్థ ద్వారా 16 నుంచి 18సార్లు కొత్త గాలి బోగిలోకి ప్రవేశి స్తుంది. ఏసీ స్థాయిని కూడా 23 నుంచి 25 డిగ్రీలకు పెంచుతామని, ఈ విధానంలో రైళ్లు ఎక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయని అధికారులు తెలిపారు. -
ఏవండీ సీ దిస్ న్యూస్ ఎప్పుడూ ఏసీలోనే ఉంటే... ఆరోగ్యం వేడెక్కుద్దట!
ఇప్పుడు ఎయిర్కండిషన్ల వాడకం ఎగువ మధ్యతరగతి నుంచి మధ్యతరగతికీ వచ్చేసింది. గతంలో ఏసీలు అమర్చుకోవడం పెద్ద సమస్య కాదుగానీ... దాని కరెంటు ఖర్చు ఎక్కువ అనే ఆందోళన ఉండేది. ఇప్పుడు కరెంటు వినియోగాన్నీ ఆదా చేసే అనేక బ్రాండ్లు వస్తుండటంతో ఏసీల వాడకం పెరిగింది. అనేక కారణాలు ఏసీల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇంట్లో అప్పుడే పుట్టిన చిన్నారి ఎండల తీవ్రత భరించలేదనో, రోగులైన పెద్దవారు ఈ ఎండలను ఎదుర్కోలేరనో ఏసీలను ఆశ్రయించడం మామూలైపోయింది. ఇలాంటి కారణాలతో గతంలో ధనిక వర్గాలకు పరిమితమైన ఏసీలు ఇప్పుడు ఓ మోస్తరు ఆదాయవర్గాలకు దగ్గరవుతున్నాయి. ఏసీల వాడకం కూడా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆ సమస్యలను అధిగమించడం ఎలాగో చూద్దాం. ఏసీలతో ఉండే ప్రయోజనాలివి... ♦ వాతావరణంలో ఉండే మార్పులేవీ మనపై దుష్ర్పభావం చూపకుండా, మనం ఎప్పుడూ ఒకే తరహా వాతావరణంలో ఉండేందుకు ఏసీలు ఉపయోగపడతాయి ♦ కొన్ని అధునాతన ఎయిర్ కండిషనర్స్‌తో ఉండే కొన్ని ఫిల్టర్స్ చాలా సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) నుంచి మనల్ని కాపాడతాయి. ♦ బయటి చప్పుళ్లు లోపలికి వినిపించనివ్వకుండా శబ్ద కాలుష్యం నుంచి ఎయిర్ కండిషనర్స్ మనల్ని కాపాడుతాయి. పై ప్రయోజనాలను ఇచ్చే ఎయిర్ కండిషన్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలూ ఉంటాయి. ఏసీలతో వచ్చే ఆరోగ్య సమస్యలివి... ఎయిర్ కండిషన్లతో వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. తీవ్రమైన తలనొప్పులు, చర్మం పొడిబారిపోవడం, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. దీనితో పాటు అనేక ఇతర సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. ఒక్కొక్కటిగా కొన్ని సమస్యలివే... తీవ్రమైన అలసట - తలనొప్పి : ఎయిర్ కండిషన్ వల్ల వచ్చే చల్లదనం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంచడం కోసంతో పాటు... ఆ చల్లదనం గది దాటి బయటకు వెళ్లకుండా ఉంచేందుకు ఏసీ ఉన్న గదిని ఎప్పుడూ మూసే ఉంచాల్సి ఉంటుంది. దాంతో అక్కడి గాలి అక్కడే ఉండిపోతుంది. మనం విడిచే కార్బన్ డై ఆక్సైడ్ కూడా ఆ గదిలోనే ఉంటుంది. ఒకవేళ పరిమితికి మించి జనం ఉన్నప్పుడు అక్కడ ఉన్న గాలిలో అందరూ విడిచే కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు పెరిగిపోతాయి. ఆక్సిజన్ పాళ్లు తగ్గిపోతాయి. దాంతో ఎయిర్ కండిషన్ గదిలో ఉన్నవారికి మెల్లగా తలనొప్పి (డల్ హెడేక్) మొదలవుతుంది. తగినంత ఆక్సిజన్ సరఫరా లేనందువల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఒకింత తగ్గుతుంది. దాంతో ఏసీలో చాలాసేపు ఉన్నవారికి బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా మన రక్తకణాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యపరమైన చేటు జరిగే అవకాశాలూ ఎక్కువ. పొడిచర్మం: ఒకింత వేడిమికీ, ఎండకూ ఉన్నప్పుడు మన చెమట గ్రంథులు చురుగ్గా పనిచేస్తుంటాయి. కానీ ఎప్పుడూ అతి చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల చెమట గ్రంథులు పనిచేయడానికి అవకాశం ఉండదు. దాంతో చాలాకాలం పాటు ఎయిర్ కండిషన్లలో ఉన్నవారి చర్మంపై చెమ్మ ఎప్పుడూ ఉండదు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే వారి చర్మంపై తేమ పూర్తిగా ఆరిపోయి చర్మం పొడిబారిపోయినట్లుగా మారుతుంది. చర్మం ఇలా పూర్తిగా పొడిబారిపోయిన కొన్ని సందర్భాల్లో చర్మంపై దురదలు కూడా రావచ్చు. అప్పటికే ఉన్న వ్యాధుల తీవ్రత పెరగడం : కొందరు వ్యక్తులు అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకు ఆస్తమా, రక్తపోటు తక్కువగా ఉండేవారు (లో-బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి ఎయిర్ కండిషన్ ఉపశమనంలా పనిచేయకపోగా... అది వారి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. కిడ్నీలో రాళ్లు : ఎయిర్ కండిషన్లో ఉన్నవారికి దాహం తక్కువ కావడం వల్ల వారు రోజు తాగాల్సిన నీళ్ల కంటే చాలా తక్కువగా నీళ్లు తాగుతుంటారు. దాంతో మూత్రపిండాలలో రాళ్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యకు దారితీయవచ్చు. ఒకరకం నిమోనియా వచ్చే అవకాశం: కొందరిలో ఏసీ వల్ల ఒకరకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్ వంటి వ్యాధులు రావచ్చు. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోవడం : చాలాకాలం పాటు ఎయిర్ కండిషన్ గదుల్లో ఉండేవారికి క్రమంగా ఎండ తీవ్రతను, వేడిమిని తట్టుకోగల సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో వారు బయటకు వచ్చినప్పుడు కొద్దిపాటి ఎండ తీవ్రతనూ భరించలేరు. ఇలా దీర్ఘకాలం పాటు ఏసీల్లో ఉండి బయటకు వచ్చాక వారిలో అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించడం, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం వంటి సమస్యలతో బాధపడతారు. శ్వాసకోశ సమస్యలు : ఏసీలు అమర్చి ఉన్న కార్లను పరిశీలించినప్పుడు ఒక రకమైన ఫంగస్‌తో పాటు కొన్ని రకాల చాలా సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సూక్ష్మజీవుల వల్ల అలర్జీలు రావచ్చు. ఈ అలర్జీ తీవ్రతరమైనప్పుడు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్తమా వంటి పరిణామాలకు దారితీయవచ్చు. కొన్ని చెవి సమస్యలు కూడా : కొన్ని ఏసీల సామర్థ్యం తక్కువ. చవక రకాలకు చెందిన ఏసీలలో ఒక రకమైన శబ్దం నిరంతరం వస్తుంటుంది. ఈ నిరంతర శబ్దానికి గురైన వారి చెవులలో అదే హోరు వినిపిస్తూ ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఈ హోరు వింటున్నవారి చెవులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఏసీ వాతావరణంలో పెరిగే ఒక రకం బూజు (మోల్డ్) వల్ల కూడా శ్వాసకోశ సమస్యతో పాటు చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగని ఒకసారి ఏసీకి అలవాటు పడ్డ తర్వాత అందులో ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏసీలోని ఒకే రకమైన స్థిరమైన ఉష్ణోగ్రతకు అలవాటు పడ్డవారు తరచూ బయటకు వెళ్తూ, లోపలికి వస్తూ ఉండాల్సి వస్తుంటే తరచూ తమ పరిసర వాతావరణం మారిపోతూ ఉండటం వల్ల పై బాధలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయి. అనర్థాలను అధిగమించడం ఇలా... ఎయిర్ కండిషనర్స్‌తో ఆరోగ్యపరమైన కొన్ని ప్రయోజనాలతో పాటు, మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయని తేలిపోయింది. కాబట్టి వృత్తిరీత్యా ఏసీలో గడపాల్సి వచ్చి వాటి కారణంగా ఆరోగ్యంపై దుష్ర్పభావం పడుతుంటే ఆ నష్టాలను తెలుసుకుని వాటి గురించి అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే వాటి నుంచి ఆశించే ప్రయోజనం ఉంటుంది. ♦ ఎప్పుడూ ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలికి వచ్చి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఉండాలి. అయితే చల్లటి వాతావరణం నుంచి అకస్మాత్తుగా బయటకు రాకూడదు. లోపలి వాతావరణంతో పాటు బయటి వాతావరణం కూడా దగ్గర దగ్గరగా ఉండే సమయాలైన ఉదయం, సాయంత్రాలలో బయటకు రావాలి. పైగా ఆ సమయాల్లో వాతావరణంలో కాలుష్యం కూడా ఒకింత తక్కువ. ఏసీలో తప్పక ఉండాల్సి వచ్చిన వారు ఆ వాతావరణానికి అనువైన దుస్తులను ధరించాలి. ఒకవేళ ఆ ఏసీ చల్లదనాన్ని భరించలేకపోతే ఉన్ని దుస్తుల వంటివి వాడాలి. చర్మం పొడిబారుతుండే వాళ్లు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్ మేనిపైన రాస్తూ ఉండాలి. ♦ ఏసీలో ఉండేవారు దాహం వేయకపోయినా అప్పుడప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. దాంతో కిడ్నీలో ఏర్పడే రాళ్లను నివారించవచ్చు. ♦ ఏసీలోని ఫిల్టర్స్‌ను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే మళ్లీ వాటిని బిగించాలి. ♦ ఏసీ కారణంగా ఆరోగ్యంపై దుష్ర్పభావాలు కనిపిస్తుంటే వాటిని వీలైనంతగా అవాయిడ్ చేయాలి. ఎయిర్ కండిషన్ వల్ల కలిగే ప్రయోజనాలూ - నష్టాలను బేరీజు వేసుకొని, దుష్ర్పభావాలను సాధ్యమైనంత తగ్గించుకుంటూ విచక్షణతో ఎయిర్ కండిషన్‌ను వాడితే, దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యమూ కాపాడుకోవచ్చు. డాక్టర్ డి. అరవింద్ కుమార్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
ఇక ఎయిర్ కండిషన్ మార్కెట్లు
వేర్వేరుగా కూరగాయలు, మాంసం మార్కెట్లు పాత రైతు బజార్లకూ హంగులు, ఏసీ సౌకర్యం సీఎం ఆదేశాలతో పురపాలక శాఖ చర్యలు హైదరాబాద్: తెలంగాణలో ఎయిర్ కండిషన్ సౌకర్యంతోపాటు ఆధునిక హంగులతో కూడిన శాఖాహార, మాంసాహార మార్కెట్లు ఏర్పాటు కానున్నాయి. వీటిని ఒకేచోట కాకుండా వేర్వేరుగా ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పాత మార్కెట్లు, రైతు బజార్లలో ఆయా సౌకర్యాలు కల్పించి ఆధునీకరించనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఏసీ సౌకర్యంతో పాటు పరిశుద్ధ, ఆరోగ్యకర వాతావరణం, సర్వ హంగులతో కూడిన కూరగాయలు, మాంసం విక్రయ మార్కెట్ల నిర్మాణం, పాత మార్కెట్ల ఆధునికీకరణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు అనువైన స్థలాలను గుర్తించి 15 రోజుల్లో సంబంధిత జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపించాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశించింది. పాతవాటిని ఆధునీకరించేందుకు కూడా ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కూరగాయల మార్కెట్ల సంఖ్య, వాటి విస్తీర్ణం, ఆధునీకరణ కోసం ప్రతిపాదించే మార్కెట్ల సంఖ్య, కొత్తగా ప్రతిపాదించే మార్కెట్లు, కావాల్సిన నిధులు తదితర వివరాలతో నమూనా ఫార్మాట్‌ను అన్ని మునిసిపాలిటీలకు పంపించింది. రెవెన్యూ శాఖ సహాయంతో స్థలాలను గుర్తించి నిర్దేశించిన నమూనాలో మూడు సెట్ల ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్లకు అందజేయాలని మునిసిపల్ కమిషనర్లకు సూచించింది. మునిసిపల్ కమిషనర్లు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి నెల రోజుల్లో తమకు సమర్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. -
ఈ ఏసీ చాలా చాలా చౌక!
మట్టి కుండ పేదవాడి ఫ్రిడ్జ్ అంటుంటారు. భగభగ మండే ఎండల్లో సైతం పైసా ఖర్చు లేకుండా చల్లటి నీళ్లతో గొంతు తడిపేది ఇదే. అయితే, ఇప్పుడు ఇదే మట్టికుండ గది ఉష్ణోగ్రతలను చల్లబరిచే ఎయిర్ కండిషనర్‌గానూ ఉపయోగపడుతుందని అంటున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన డిజైనర్ దిబాల్ట్ ఫావెరీ. ఈయన ఒక చిన్న టైట పాత్ర, అల్యూమినియం సామాగ్రి, చిన్న బ్లోయర్ సాయంతో అత్యంత తక్కువ ఖర్చులో ఏసీని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది అదే. నీరు ఆవిరయ్యే క్రమంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న సాధారణ భౌతికశాస్త్ర సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఇది. పొడవాటి మట్టిపాత్ర.... లోపలిభాగంలో ఓ అల్యూమినియం గొట్టం... దాంట్లో వరుసగా అల్యూమినియంతో చేసిన చక్రాలు ఉంటాయి. మట్టిపాత్రకు, అల్యూమినియం గొట్టానికి మధ్యభాగంలో నీరు ఉంటుంది. మట్టిపాత్ర అడుగుభాగంలో ఉన్న రంధ్రం నుంచి బయటి గాలి లోపలికి వస్తుంది. బ్లోయర్ గాలిని పైకి పంపిస్తుంటుంది. అప్పటికే చల్లబడ్డ నీరు కాస్తా ఆవిరిగా మారి అల్యూమినియం గొట్టంపైభాగం ద్వారా బయటకు వస్తుందన్నమాట. గది ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ గాలి ఉష్ణోగ్రత కనీసం 8 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకూ తక్కువ ఉంటుంది. మట్టిపాత్రకు రూ.100, అల్యూమినియం గొట్టానికి, చక్రాలకు, బ్లోయర్కు కలిపి మరో రూ.300 అనుకున్నా మొత్తమ్మీద రూ.400లకే ఓ చిన్న ఏసీ వచ్చేస్తుంది. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కడప రూరల్, న్యూస్‌లైన్ : మెప్మా, అపిట్కో హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్లలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అపిట్కో జిల్లా సమన్వయకర్త రామకృష్ణారెడ్డి, శిక్షణా నిర్వాహకుడు ఎస్.గౌస్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల ఉచిత సాంకేతిక శిక్షణతోపాటు ఉపాధి కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 18-35 లోపు వయస్సు అర్హత కలిగి, కడప పట్టణంలో నివసించేవారై ఉండాలన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు డోర్ నెం 1/2237, ఎంఐజీ 23ఏ, ఎల్ఐసీ సర్కిల్, ఆర్‌ఎస్‌రోడ్డు, ప్రసాద్ గ్యాస్ దగ్గర అనే చిరునామాలో సంప్రదించాలన్నారు. అలాగే 9491417490, 9989334063, 99127 71325 అనే నంబర్లలో కూడా సంప్రదించవచ్చన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.