2050 నాటికి దేశంలో 40 కోట్లకు పైగా చేరనున్న పట్టణ జనాభా
9 రెట్లు గృహాల్లో పెరగనున్న ఏసీల వినియోగం
నాలుగు రెట్లు పెరగనున్న విద్యుత్ డిమాండ్
ఒత్తిడి పెరిగి పవర్ గ్రిడ్లపై పడనున్న పెను భారం
అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఒకప్పుడు విలాస వస్తువుగా కనిపించిన ఎయిర్ కండిషన్లు(ఏసీలు).. ఇప్పుడు విపరీత ఎండలతో తప్పనిసరి అవసరంగా మారిపోతున్నాయి. గతంలో సంపన్నులకే పరిమితమైన ఏసీలు.. ఇప్పుడు సామాన్యులకు చేరువవుతున్నాయి. ఈ క్రమంలో అవగాహన లేమి, అనవసర వృథా అనర్థాలకు దారితీస్తోంది. ఏసీల అతి వినియోగం వల్ల పవర్ గ్రిడ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) హెచ్చరించింది.
రానున్న రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో పాటు పట్టణ జనాభా కూడా భారీగా వృద్ధి చెంది.. ఏసీల వాడకాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాయని పేర్కొంది. దీంతో పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఐఈఏ తన తాజా నివేదికలో వెల్లడించింది.
ప్రతి వందలో 24 ఇళ్లకు ఏసీ..
దేశవ్యాప్తంగా ప్రతి 100 ఇళ్లల్లో 24 ఇళ్లకు ఏసీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) ఇటీవల వెల్లడించింది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం గత 50 ఏళ్లలో 17 వేల మంది ఎండ దెబ్బకు మరణించారు. విపరీత ఎండలతో భవనాల నుంచి రేకుల షెడ్డు వరకూ ఏసీలను వినియోగిస్తున్నారని పేర్కొంది.
ఫలితంగా ఏసీలకు వాడే విద్యుత్ వినియోగం.. మొత్తం విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 20 శాతానికి చేరింది. 2050 నాటికి దేశంలో పట్టణ జనాభా సంఖ్య 40 కోట్లకు పైగా చేరనుందని అంచనా. దీంతో అప్పటికల్లా పట్టణాల్లో విద్యుత్ డిమాండ్ నాలుగు రెట్లు పెరగనుందని.. గృహాల్లో ఏసీల వాడకం తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా.
ఇది మొత్తం ఆఫ్రికా ఖండంలో విద్యుత్ వినియోగం కంటే ఎక్కువ. ఏసీలకు ఇలా డిమాండ్ పెరగడం వల్ల విద్యుత్ లోటు ఏర్పడి.. కోతలు విధించాల్సిన అవసరం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో ఏసీలకు 3 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్..
ఏసీలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వినియోగించడం ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తాజా అధ్యయనంలో వెల్లడించింది. దీని ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ టన్నుల రిఫ్రిజిరేషన్(టీఆర్) ఎయిర్ కండీషనర్ సామర్థ్యం ఉంది. ఇది 10 ఏళ్లలో దాదాపు 250 మిలియన్ టీఆర్‌కు చేరుకునే ప్రమాదం ఉంది.
దీని వల్ల 2030 నాటికి దేశంలో విద్యుత్ లోడ్ సుమారు 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఏసీల విద్యుత్ డిమాండ్ ఏటా దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతం. వినియోగదారులు ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌గా పెట్టుకుంటే.. దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని బీఈఈ నివేదికలో పేర్కొంది.
ఏసీ ఎక్కువైనా అనర్థమే..
ఒక మనిషి 1.5 టన్నుల ఏసీని ఉపయోగిస్తే.. అది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్‌ను వినియోగించి.. దాదాపు 0.98 కిలోల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది.
సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 36–37 డిగ్రీల సెల్సియస్. కానీ 18–21 డిగ్రీల సెల్సియస్‌కు ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, కళ్లు, చర్మం పొడిబారడం, రక్తపోటు వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment