ట్రంప్ కన్నా నేనే బెటరేమో!
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ ను చూడగానే ఆయన అభిమానులు ఉప్పొంగిపోతారు. మరికొందరైతే ఇటీవల ఓ అడుగు ముందుకేసి.. 'నాజీ శైలీ'లో ఆయనకు సెల్యూట్ కూడా చేస్తున్నారు. మరీ ట్రంప్ ఏం తక్కువ తిన్నాడా.. ఆ ఫాసిస్ట్ నియంతనే మరిపించేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు.
దీంతో సహజంగానే చాలామంది జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, ట్రంప్ మధ్య పోలికలు పెడుతున్నారు. ఇద్దరినీ ఒకేగాటున కడుతున్నారు. ఈ నేపథ్యంలో హిట్లర్ స్వయంగా దిగొచ్చి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఓ టీవీ చర్చలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ట్రంప్ ప్రచారశైలిపై, అడ్డదిడ్డంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై హిట్లర్ ఇప్పుడు ఉండివుంటే ఏమనుకొని ఉండేవాడు. ఓ రకంగా తన భావజాలాన్ని ముందుకు తీసుకెళుతున్నట్టు కనిపిస్తున్న ట్రంప్ ను హిట్లర్ మెచ్చుకునేవాడా? లేక విమర్శించేవాడా? ఇలాంటి ప్రయత్నమే కొనన్ చానెల్ తాజాగా చేసింది. కొనన్ ఒబ్రియన్ షోలో హిట్లర్ ను స్వయంగా ఆహ్వానించింది. సారా సిల్వర్ మ్యాన్ హిట్లర్ వేషధారణలో వచ్చి.. ఇప్పుడు హిట్లర్ బతికి ఉంటే ఏమనుకొని ఉండేవాడో, ట్రంప్ పై ఆయన మనోగతమేమిటో వెల్లడించే ప్రయత్నం చేసింది.
ట్రంప్ గురించి అడిగినప్పుడు.. 'నన్ను తప్పుగా భావించకు కొనన్. అతను చెప్పే చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను. 90శాతం వరకు అతను నాలాగే చెప్తున్నాడు. కానీ అతను చెప్తున్న పద్ధతి నాకు నచ్చడం లేదు. అతను అల్పంగా మాట్లాడుతున్నాడు. అతనితో నన్ను పోల్చడం నన్ను నిరాశపరుస్తున్నది. నన్ను ఇంత తక్కువగా ప్రజలు అర్థం చేసుకున్నారా? అని బాధేస్తోంది' అని హిట్లర్ వేషధారి సారా పేర్కొంది.