సింగపూర్ : హిమాలయా పర్వత శ్రేణిలో ఎత్తైనదే కాక ప్రమాదకర శిఖరాల్లో అన్నపూర్ణ పర్వతం ఒకటి. తాజాగా ఈ పర్వతాన్ని అధిరోహించి.. ప్రమాదం పాలైన మలేషియా డాక్టర్ సింగపూర్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వివరాలు.. మలేషియాకు చెందిన చిన్ వుయ్ కిన్ (48) సిటీ స్టేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది పర్వతారోహకులతో కలిసి గత నెల 23న హిమాలయాల్లో ఎత్తైన శిఖరం అయిన అన్నపూర్ణ (ఎత్తు 8100 మీటర్ల) పర్వతాన్ని అధిరోహించాడు. కానీ అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న క్యాంప్‌కు చేరుకోలేకపోయాడు చిన్ వుయ్.
ఇది గమనించిన తోటి పర్వతారోహకులు, గైడ్ అతన్ని వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఆచూకీ లభించలేదు. దాంతో వారంతా క్యాంప్‌కు చేరుకుని ఈ విషయం గురించి అధికారులకు తెలియజేశారు. చిన్ వుయ్ మంచు వాలులో చిక్కుకుపోయి ఉంటాడని భావించిన క్యాంప్ నిర్వహకులు తొలుత హెలికాప్టర్‌ని రంగంలోకి దించారు. కానీ అతని జాడ తెలియలేదు. దాంతో నలుగురు అనుభవజ్ఞులైన షేర్పాలను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సారి వారి ప్రయత్నం ఫలించింది. నాలుగు గంటలపాటు వెతగ్గా దాదాపు 6500 మీటర్ల ఎత్తులో.. అపస్మారక స్థితిలో ఉన్న చిన్ వుయ్ వారికి కనిపించాడు. వెంటనే అతన్ని ఖట్మాండులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తేల్చి చెప్పారు.
ఈ విషయం గురించి ఓ డాక్టర్ మాట్లడుతూ.. ‘స్పృహలోకొచ్చిన తర్వాత చిన్ వుయ్ మాట్లాడిన మొదటి మాట నాకు కొన్ని వేడి నీళ్లు ఇవ్వగలరా అని అడిగాడు. ఆ తర్వాత వెంటనే స్పృహ కోల్పోయాడ’ని తెలిపారు. అంతేకాక ఇన్ని రోజుల పాటు అంత శీతల వాతావరణంలో అతడు బతికి ఉండటమే గొప్ప అని పేర్కొన్నారు. ఆ తరువాత చిన్ వుయ్‌ని సింగపూర్‌కి తరలించి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న చిన్ వుయ్ నిన్న (గురువారం) మరణించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన ఎవరెస్ట్ కన్నా అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించడమే కష్టం అంటున్నారు పర్వతారోహకులు. అన్నపూర్ణ పర్వతం మీదే అధిక మరణాల సంఖ్య నమోదవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment