శ్రీదేవి (ఫైల్ ఫోటో)
దుబాయ్ : దిగ్గజ నటి శ్రీదేవి మరణించి దాదాపు 35 గంటలు గడుస్తున్నా తుది వీడ్కోలుపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె పార్థివదేహాన్ని దుబాయ్ నుంచి ముంబైకి తరలించడంలో జాప్యం నెలకొంది. శనివారం రాత్రి హోటల్ గదిలో అచేతనంగా పడిఉన్న శ్రీదేవిని స్థానిక వైద్య బృందం, పోలీసులు కలిసి రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అక్కడి నుంచి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించడానికి సుదీర్ఘ ప్రక్రియ అవసరమవుతుంది. ఈ వ్యవహారం గురించి ‘ప్రవాసీ మిత్ర’ ఎడిటర్ భీంరెడ్డి కొంత సమాచారాన్ని అందించారు.
దుబాయ్ నుంచి మృతదేహాన్ని తరలించాలంటే..
►మృతదేహానికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ ఫోరెన్సిక్ నివేదికను రూపొందిస్తారు.
►అనంతరం పార్థివదేహాన్ని ముహైస్నాకు తరలించి, విమానంలో రవాణా చేసేందుకు అనువుగా సుగంధపరిమాళాలు, శుభ్రమైన వస్త్రాల్లో చుడతారు. ఈ ఎంబామింగ్ ప్రక్రియకు కనీసం రెండు గంటలు పడుతుంది.
►ఈలోపే స్థానిక పోలీసులు డెత్ సర్టిఫికేట్‌ను జారీచేయాల్సిఉంటుంది. ఇందుకోసం మృతురాలు/మృతుడి కుటుంబీకుల నుంచి అఫిడవిట్ తీసుకుంటారు. ఫోరెన్సిక్ రిపోర్టు అందిన తర్వాతే పోలీసులు ముందుకు వెళతారు.
►దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు.. మృతురాలు/మృతుడి పాస్‌పోర్టును రద్దు చేస్తారు.
►ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతితో మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు.
►అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తారు. కస్టమ్స్ క్లియరెన్స్ అనంతరం విమానంలో భారత్‌కు తరలిస్తారు.
►శ్రీదేవి పార్థివదేహాన్ని తరలించేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానాన్ని సిద్ధంగా ఉంచారు.
►భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు విమానం ముంబైకి చేరుకునే అవకాశంఉంది.
Comments
Please login to add a commentAdd a comment