అమెజాన్ అలెక్సా.. ఓ మంచి వర్చువల్ అసిస్టెంట్. అడగ్గానే చాలా పనులు చేసిపెడుతుంది. అలెక్సా.. అని పిలవగానే స్పందిస్తుంది. మనకు కావాల్సిన సమాచారమేదైనా సరే.. వికీపీడియా సహా అనేక వెబ్‌సైట్లను వడపోసి మరీ సేకరించి పెడతుంది. ఇంట్లోని స్మార్ట్ పరికరాలనూ మనం చెప్పినట్టుగా నియంత్రిస్తుంది. ఇదేదో భలే బాగుందే.. మనమూ అలెక్సాను తెచ్చేసుకుందాం అనుకుంటే మాత్రం.. కొంచెం జాగ్రత్త సుమా అనే హెచ్చరిక వినవస్తోంది. ఏమిటంటారా..? ఈ మధ్య అలెక్సా చేసిన ఓ నిర్వాకం అలాంటిది మరి!
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో పోర్ట్‌ల్యాండ్ అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి చెందిన డేనియల్ అనే మహిళ ఈ మధ్యే అమెజాన్ ఎకో గాడ్జెట్‌ను కొనుగోలు చేసింది. అందులో వర్చువల్ అసిస్టెంట్ అలెక్సాతో ముచ్చట్లు మొదలుపెట్టింది. అప్పుడప్పుడు వంటల ‘రెసిపీ’లు అడిగితే.. అలెక్సా ఇంటర్నెట్ అంతా గాలించి అప్పజెప్పింది. ఆ తర్వాత అడిగిన ఎన్నో పనులు చేసిపెట్టింది.
‘మన ముచ్చట్లు’ బయటికెళితే ఎలా?
అపాయింట్‌మెంట్లు ఫిక్స్ చేయడం మొదలుకొని రైలు, విమానాల టికెట్లు బుక్ చేయడం వరకూ అలెక్సా అన్ని పనులు చేసి పెడుతోందని డేనియల్ తెగ ముచ్చటపడిపోయింది. కానీ ఓ రోజు వారికి ఓ బాంబు లాంటి వార్త తెలిసింది. ఆమె, ఆమె భర్త ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకున్న కొన్ని ముచ్చట్లను అలెక్సా రికార్డు చేసింది.
వాటిని డేనియల్ కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న భర్త స్నేహితుడొకరి ఫోన్‌కు పంపేసింది! డేనియల్ ఈ విషయాన్ని ఓ స్థానిక చానల్‌కు చెప్పడంతో విష యం వైరల్ అయిపోయింది. ‘‘ఎవరూ లేనప్పుడు బోలెడన్ని మాట్లాడుకుంటాం. వాటిని ఎవరైనా వింటే కొంపలంటుకు పోవూ..! ఇప్పటికే కృత్రిమ మేధ మనుషులపై పెత్తనం చలాయిస్తుందన్న ఆందోళన పెచ్చుమీరుతున్న సమయంలో.. అలెక్సా నిర్వాకం మరింత భయపెడుతోంది..’’ అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తననే పిలిచిందనుకుందట!
అయితే అలెక్సాను రూపొందించిన అమెజాన్ మాత్రం.. ‘‘అబ్బే.. అంత సీనేమీ లేదు. డేనియల్, ఆమె భర్త మాట్లాడుకుంటున్నప్పుడు ‘అలెక్సా’ అన్నట్టుగా అనిపిస్తే... ఆ గాడ్జెట్ తననే పిలు స్తున్నారనుకుని వెంటనే స్పందించింది. పైగా వాళ్ల మాటల్లో రికార్డింగ్ లాంటి పదాలు వినిపించ డంతో మాటల్ని రికార్డు చేయాలేమో అనుకుని చేసేసింది.
డేనియల్ భర్త సహోద్యోగి పేరు కూడా వినిపించే ఉంటుంది కాబట్టి.. మాటల రికార్డిం గ్‌ను అతడికి పంపేసింది..’’ అని సర్దిచెబుతోంది. ఏదేమైనా ఎటుపోయి ఏటో వస్తోంది వ్యవహారం!
Comments
Please login to add a commentAdd a comment