మరిన్ని చిక్కుల్లో షరీఫ్.. ఫ్యామిలీ..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై పాకిస్థాన్‌కు చెందిన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో-ఎన్‌ఏబీ(జాతీయ జవాబుదారి సంస్థ) మరో నాలుగు అవినీతి ఆరోపణ కేసులు పెట్టింది. ఇప్పటికే పనామా కేసు కారణంగా ఆయన ప్రధాని పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన మిగితా అవినీతి ఆరోపణల కింద కూడా వెంటనే ఆయనపైనా ఆయన కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేయాలని జూలై 18 నాటి తీర్పు సమయంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తాజాగా ఈ కేసులు నమోదు చేశారు.
నవాజ్ షరీఫ్ ఆయన కుమారులు హసన్, హుస్సేన్, కూతురు మరియామ్, అల్లుడు మహ్మద్ సఫ్దార్, ఇష్క్‌దార్‌పై ఎన్‌ఏబీ అధికారులు తాజాగా కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉమ్మడి విచారణ కమిటీ ఇచ్చిన సూచనలు, అందించిన ఆధారాల ద్వారానే తాము ఈ కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఏబీ అధికారులు తెలిపారు. దాంతోపాటు తాము కూడా విలువైన ఆధారాలు విచారణలో భాగంగా సేకరించినట్లు వెల్లడించారు.