ఆల్కహాల్ లేకుండానే బీరు!
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు బీరు లాంటి చల్లటి పానీయాలు తాగాలనుకునేవారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువే ఉంటారు. అందులోని ఆల్కహాలుకు అలవాటు పడితే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన పడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. అలాంటివారి కోసమే ఒక్కశాతం కూడా ఆల్కహాల్ లేని బీరును నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ కంపెనీ హైనెకెన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. హైనెకెన్ 0.0 పేరుతో ఈ బీరును ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఆల్కహాలు అసలు లేని లేదా అతి తక్కువ ఉండే బీర్లను తయారు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2010 నుంచి ఇలాంటి బీర్లను తయారు చేస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఆ కంపెనీలన్నీ కేవలం తమ స్వదేశానికి మాత్రమే పరిమితం కాగా, డచ్ కంపెనీ మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఈ ఆల్కహాలు లేని బీర్ల మార్కెట్ 2010 నుంచి ఇప్పటివరకు ఏటా ఐదు శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి.