మనిషి ఎంతకాలం జీవించవచ్చు? పరిశోధనల్లో ఏం తేలింది? | Scientists reveal the maximum age a human | Sakshi
Sakshi News home page

maximum age a human: మనిషి ఎంతకాలం జీవించవచ్చు? పరిశోధనల్లో ఏం తేలింది?

Published Mon, Mar 4 2024 10:54 AM | Last Updated on Mon, Mar 4 2024 11:32 AM

Scientists reveal the maximum age a human - Sakshi

దీర్ఘాయుష్షు... ఇది ప్రతీమానవునికీ ఉండే కోరిక. అందుకే శాస్త్రవేత్తలు నిరంతరం మనిషి ఆయుష్షు పెంపుదలకు సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల డచ్ పరిశోధకులు మానవుడు ఎంత సుదీర్ఘకాలం పాటు జీవించవచ్చనే విషయాన్ని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. 

డచ్ పరిశోధకులు మనిషి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను కూడా వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన స్థితిగతులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని డచ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు తమ పరిశోధనల కోసం ముందుగా వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరుల డేటాను సేకరించారు. దీని ని సమూలంగా విశ్లేషించారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక రూపొందించారు. 

రోటర్‌డామ్‌లోని టిల్‌బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లని తమ పరిశోధనల ద్వారా కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త ఎక్కువేనని వారు చెబుతున్నారు.  

పరిశోధకులు మూడు దశాబ్దాల డేటా ఆధారంగా మానవుని గరిష్ట ఆయుష్షును అంచనావేయగలిగారు. ఈ పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మనిషి ఆయుష్షు పెరుగుతూ వస్తోందని, వృద్ధాప్యం కూడా దూరమవుతున్నదన్నారు. ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.  

మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అని డచ్‌ పరిశోధకులు పేర్కొన్నారు. కాగా ఈ డచ్ శాస్త్రవేత్తల పరిశోధనలు అంతకుముందునాటి అమెరికన్‌ శాస్త్రవేత్తల పరిశోధనల నివేదికలను పోలివుండటం వివేషం. అమెరికా శాస్త్రవేత్తలు కూడా డచ్‌ పరిశోధకులు వెల్లడించిన గరిష్ట వయో పరిమితినే గుర్తించారు. అయితే తమ దేశంలో ప్రస్తుతం ఉన్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు వివరించారు.

డచ్‌ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ఈ పరిశోధనల కోసం ‘ఎక్స్‌ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తొలగించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే 122 సంవత్సరాల164 రోజులు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ తన ఆయుష్షుకు అడ్డుపడే అన్ని పరిధులను అధిగమించారని ఐన్‌మహ్ల్ పేర్కొన్నారు. ఈయన మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ పరిశోధనల వివరాలు త్వరలోనే ప్రచురితమై అందుబాటులోకి రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement