అదిగదిగో మరో ‘భూమి’
ఇటీవలి వరకు సౌరకుటుంబానికి అవతల భూమి లాంటి గ్రహాలు లేవనే భావించాం. అయితే కెప్లర్ టెలిస్కోప్ పరిశోధనల పుణ్యమా అని ఎంతో దూరంలో ఉన్న గ్రహాలను సైతం ఖగోళ పరిశోధకులు కనిపెట్టారు. సౌరకుటుంబానికి అవతల ఉన్న వందల వేల గ్రహాలను ఇప్పటికే గుర్తించారు. మరి వాటిల్లో మన భూమిని పోలిన గ్రహాలెన్నో తెలుసా! మొత్తం 4 వేల ఎక్సోప్లానెట్లలో 216 గ్రహాల్లో జీవం ఉండే అవకాశముందని శాస్త్రవేత్తల అంచనా. తాజాగా వీటిని మరింత జల్లెడపట్టి భూమికి అతిదగ్గరి పోలికలున్న 20 గ్రహాలను గుర్తించారు.
ఫొటోలో ఉన్న గ్రహమే ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న గ్రహం ‘కెప్లర్ 186ఎఫ్’ ఊహాచిత్రం. ఇది భూమికంటే కేవలం 10 శాతం ఎక్కువ సైజులో ఉంటుందని, భూమి నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న మరో గ్రహం ‘కెప్లర్ 62 ఎఫ్’. కాగా, ఇది భూమి కంటే 40 శాతం పెద్దగా ఉంటుంది. దాదాపు 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వంలో మనిషి లాంటి జీవజాతి కాకపోయినా కనీసం ఏదో ఒక రూపంలో జీవం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఈ వర్గీకరణ జరిగిందని పేర్కొంటున్నారు.