kepler telescope
-
సౌర కుటుంబానికి అవతల.. సప్త గ్రహ కుటుంబం!
నిన్న మొన్నటివరకూ సౌర కుటుంబానికి అవతల ఇంకో గ్రహం ఉందంటేనే నమ్మేవారు కాదు. కానీ. ఇప్పుడు ఇలాంటి ఎక్సోప్లానెట్లు కొన్ని వేలు ఉన్నాయన్న విషయం సుస్పష్టమైంది. మరి.. ఇన్ని వేల గ్రహాల్లో భూమిని పోలినవి? మన సౌరకుటుంబం మాదిరిగా ఉన్నవి ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకూ సమాధానం అవుననే. కాకపోతే తాజాగా ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. అదేమిటో తెలుసా? సప్త గ్రహ కుటుంబం! భూమికి కొన్ని రెట్లు ఎక్కువ పరిమాణమున్న ఏడు గ్రహాలు ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూంటాయి ఇందులో! సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయన్నది కాసేపు పక్కనబెడదాం. విశ్వం మొత్తమ్మీద ఎన్ని ఉన్నాయంటే కచ్చితమైన సమాధానమైతే తెలియదు. కానీ.. ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా మన గ్రహ వ్యవస్థకు ఆవల గ్రహాలెన్ని ఉన్నాయి? వాటిల్లో భూమిని పోలినవి ఎన్ని? జీవించే పరిస్థితులు ఉన్నవాటి సంఖ్య ఎంత? మాతృనక్షత్రానికి (మనకు సూర్యుడు) ఎంత దూరంలో గ్రహాలు తిరుగుతున్నాయి? అన్న అనేక అంశాలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2009లో కెప్లర్ మిషన్‌ను ప్రయోగించింది. అంతరిక్షంలో ఉంటూ మన పాలపుంతలో భూమి సైజున్న గ్రహాలు ఎన్ని ఉన్నాయో చూడటం ఈ టెలిస్కోపు లక్ష్యం. తొమ్మిదేళ్లపాటు ఈ టెలిస్కోపు అంతరిక్షంలోని ఓ చిన్న భాగాన్ని మాత్రమే పరిశీలించి మన పాలపుంతలోనే కనీసం కొన్ని వందల కోట్ల ఎక్సోప్లానెట్లు ఉన్నాయని తేల్చింది. 2009 మార్చి ఆరవ తేదీన నింగికి ఎగిసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ కెప్లర్ టెలిస్కోపు వీటిల్లో ఐదు వేలకుపైగా గ్రహాలను గుర్తించింది కూడా! ట్రాపిస్ట్-1లోనూ ఏడు గ్రహాలు... కెప్లర్ గుర్తించి అనేకానేక గ్రహ వ్యవస్థల్లో ట్రాపిస్ట్-1 ఒకటి. భూమికి సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుందీ వ్యవస్థ. ఓ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం (మన సూర్యుడి సైజులో 0.8 - 0.6 శాతం సైజు మాత్రమే ఉండే నక్షత్రాలు) చుట్టూ భూమి సైజున ఏడు గ్రహాలతో ఏర్పడింది ఇది. ఈ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలు మన సూర్యుడి మాదిరి అంత ప్రకాశవంతంగా ఏమీ ఉండవు. మన పాలపుంతలో అనేక రకాల నక్షత్రాలు ఉన్నా ఈ రెడ్ డ్వార్ఫ్ రకంవి ఎక్కువగా ఉన్నాయని అంచనా. ట్రాపిస్ట్-1లోని ఏడు గ్రహాల్లోనూ నీళ్లు ఉండేందుకు అవకాశం ఉందని నాసా చెబుతోంది. స్పీట్జర్, కెప్లర్, హబుల్.. తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపుల సాయంతో ఈ గ్రహ వ్యవస్థను ఇప్పటికే క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తాజాగా ఇంకో సప్తగ్రహ వ్యవస్థ... కెప్లర్ టెలిస్కోపు ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉండగా... తాజాగా దీనిద్వారా ఇంకో సప్తగ్రహ వ్యవస్థ గురించి తెలిసింది. కాకపోతే ఇందులో ట్రాపిస్ట్-1లో మాదిరిగా భూమి కంటే పెద్ద సైజున్న గ్రహాలు ఉండటం విశేషం. ఈ సరికొత్త గ్రహ వ్యవస్థను ‘కెప్లర్-385’ అని పిలుస్తున్నారు. భూమికి సుమారు వెయ్యి కాంతి సంత్సరాల దూరంలో ఉందీ వ్యవస్థ. భూమి సైజు కంటే 1.3 రెట్ల నుంచి 2.5 రెట్లు ఎక్కువ సైజుండే గ్రహాలను సూపర్ ఎర్త్‌లతో కూడి ఉంది ఇది. ఈ గ్రహాలకు... దాని మాతృ నక్షత్రానికి మధ్య ఉన్న దూరం మన సూర్యుడికి, బుధ గ్రహానికి మధ్య ఉన్నంత దూరం! చదవండి: ఉపన్యాసం వద్దు.. ట్రంప్‌పై న్యాయమూర్తి ఆగ్రహం -
వందకు పైగా కొత్త గ్రహాలు!
లాస్ఏంజెలెస్: మన సౌర కుటుంబానికి వెలుపల వందకు పైగా గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటి ఉపగ్రహాలపై జీవనానికి అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ గ్రహాలన్నీ వాయు గ్రహాలైనప్పటికీ వాటి ఉపగ్రహాలపై మాత్రం భూమి మాదిరిగా నేలలు ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్లాండ్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2009లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా ఇప్పటికే మన సౌర వ్యవస్థకు వెలుపల వేలాది గ్రహాలను కనుగొన్న విషయం తెలిసిందే. -
అంతరిక్షంలో మరో సౌరవ్యవస్థ
మియామి : అచ్చంగా మన సౌర వ్యవస్థను పోలిన మరో సౌర వ్యవస్థను అమెరికాకు చెందిన నాసా గుర్తించింది. కెప్లర్ టెలిస్కోప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఈ సౌర వ్యవస్థ ఉన్నట్లు నాసా అధికారులు ప్రకటించారు. మన సౌర వ్యవస్థలో సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించిన విధంగానే.. అంతరిక్షంలో కొత్తగా గుర్తించిన సౌర వ్యవస్థలోనూ ఒక నక్షత్రం చుట్టూ.. గ్రహాలు తిరుగుతున్నాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా గుర్తించిన సౌర వ్యవస్థలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడా జీవరాశి మనుగడ సాగించేందుకు అవకాశం లేదని నాసా తెలిపింది. కొత్తగా కనుగొన్న సౌర వ్యవస్థలోని కెప్లర్ 90ఐ గ్రహంలో రాళ్లు, పర్వతాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఆ గ్రహం నక్షత్రం చుట్టూ ఒకసారి తిరిగేందుకు 14.4 రోజుల సమయం పడుతుందని నాసా తెలిపింది. అంటే భూమి మీద రెండు వారాల సమయం.. అక్కడ ఒక్క రోజుతో సమానం. మన భూమితో పోలిస్తే అక్కడ ఉష్ణోగ్రత చాలా అధికం. కెప్లెర్ 90ఐ గ్రహం మీద.. 426 డిగ్రీల సెల్సియెస్ వేడి ఉంటుంది. -
గ్రహాంతర జీవులను గుర్తించారా?
నాసా గుర్తించినట్లు యూట్యూబ్‌లో ఓ వీడియో చక్కర్లు సాక్షి, హైదరాబాద్: గ్రహాంతర వాసులు ఉన్నారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించిందా? నాసా సంగతేమోగానీ.. రెండు మూడు రోజులుగా ఈ వార్త నెట్ ప్రపంచంలో వేగంగా చక్కర్లు కొడుతోంది. నాసా ఉన్నతాధికారి ఒకరు ఈ విషయమై అమెరికన్ పార్లమెంటుకు వాంగ్మూలమిచ్చినట్లు యూట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తి పేరుతో ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఆ ఉన్నతాధికారి పేరు థామస్ జుర్‌బుకెన్ అని.. రెండు నెలల క్రితం అమెరికన్ పార్లమెంటుకు ఓ వాంగ్మూలమిచ్చారని వీడియోలో పేర్కొన్నారు. మానవజాతి గ్రహాంతర వాసుల ఉనికిని నిర్ధారించే విషయమై ఇప్పటివరకూ చేప ట్టిన అన్ని కార్యక్రమాలు, ప్రయోగాలను దృష్టిలో ఉంచు కుని తాను ఈ అంచనాకు వస్తున్నట్లు థామస్ ఈ వీడియోలో చెబుతారు. శని గ్రహపు ఉపగ్రహా ల్లో ఒక దానిపై ఆక్సిజ న్ ఉన్నట్లు నాసా ఇటీవలే గుర్తించడం.. గురు గ్రహం ఉపగ్రహమైన యూరోపా పై సముద్రాలు ఉన్నాయన్న అంచనాలు కూడా బలపడటం.. కెప్లర్ టెలిస్కోపు సేకరించిన సమాచారం ఆధారంగా జరిపిన విశ్లేషణ కారణంగా 219 కొత్త ఎక్సోప్లానెట్లను గుర్తించడం తదితర పరిణామాలను ఈ వీడియోలో ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఇతర గ్రహాలపై జీవం ఉండేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే నాసా అధికారిక వెబ్సైట్లో మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన లేదు. ఈ వీడియో ఉన్న యూట్యూబ్ అకౌంట్ ఓ హ్యాకర్ గ్రూప్‌నకు చెందినది కావడం కొసమెరుపు. -
అదిగదిగో మరో ‘భూమి’
ఇటీవలి వరకు సౌరకుటుంబానికి అవతల భూమి లాంటి గ్రహాలు లేవనే భావించాం. అయితే కెప్లర్ టెలిస్కోప్ పరిశోధనల పుణ్యమా అని ఎంతో దూరంలో ఉన్న గ్రహాలను సైతం ఖగోళ పరిశోధకులు కనిపెట్టారు. సౌరకుటుంబానికి అవతల ఉన్న వందల వేల గ్రహాలను ఇప్పటికే గుర్తించారు. మరి వాటిల్లో మన భూమిని పోలిన గ్రహాలెన్నో తెలుసా! మొత్తం 4 వేల ఎక్సోప్లానెట్లలో 216 గ్రహాల్లో జీవం ఉండే అవకాశముందని శాస్త్రవేత్తల అంచనా. తాజాగా వీటిని మరింత జల్లెడపట్టి భూమికి అతిదగ్గరి పోలికలున్న 20 గ్రహాలను గుర్తించారు. ఫొటోలో ఉన్న గ్రహమే ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న గ్రహం ‘కెప్లర్ 186ఎఫ్’ ఊహాచిత్రం. ఇది భూమికంటే కేవలం 10 శాతం ఎక్కువ సైజులో ఉంటుందని, భూమి నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న మరో గ్రహం ‘కెప్లర్ 62 ఎఫ్’. కాగా, ఇది భూమి కంటే 40 శాతం పెద్దగా ఉంటుంది. దాదాపు 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వంలో మనిషి లాంటి జీవజాతి కాకపోయినా కనీసం ఏదో ఒక రూపంలో జీవం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఈ వర్గీకరణ జరిగిందని పేర్కొంటున్నారు. -
వాళ్లు ఎక్కడున్నారో?
ఈ అనంత విశ్వంలో మనకు తెలిసి భూమిపై మాత్రమే జీవం ఉంది! మరే ఇతర గ్రహంపై జీవం ఆనవాలు ఇప్పటివరకు కనుగొలేదు. మానవుని కంటే ఎన్నోరెట్లు మేధస్సు కలిగిన గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా? లేవా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలు శాస్త్రవేత్తలతోపాటు సామాన్య మానవులకు సైతం ఆసక్తి కలిగిస్తున్న అంశాలు. ఏదేమైనప్పటికీ ఏలియన్స్ ఉనికిని కనిపెట్టే దిశగా వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ అంశంపై అనేక దేశాలు తమ పరిశోధలను వేగిరం చేశాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతర జీవుల ఉనికికి ఊతమిస్తున్న అంశాలు, వాటి అన్వేషణకు చేపడుతన్న చర్యలు..వంటి విశేషాలపై ఫోకస్.. ఊతమిస్తున్న ఎర్త్-2 డిస్కవరీ? కెప్లర్ టెలిస్కోపు సహాయంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అచ్చం భూమిని పోలిన కొత్త గ్రహాన్ని కనిపెట్టింది. దీనికి కెప్లర్-452 అని పేరు పెట్టారు. దీన్ని ఎర్త్-2 అని కూడా పిలుస్తారు. చైనా ట్వీటర్‌గా పిలిచే ‘సినా వైబో’లో ఈ డిస్కవరీ పట్ల ప్రజలు విశేషంగా స్పందించారు. 4.4 కోట్ల మంది చైనీయులు ఈ డిస్కవరీపట్ల ఉత్సుకతను ప్రదర్శించారు. 90 వేల మంది దీనిపై ఆన్లైన్ చర్చలో పాల్గొన్నారు. ఈ విశ్వంలో మానవులు మాత్రమే కాకుండా ఇతర జీవులు జీవించడానికి ఆస్కారముందనేదుంకు ఈ డిస్కవరీ నిదర్శనమని చైనీయులు నమ్మారు. దీనిపై చైనా మీడియా కూడా హడావుడి చేసేసింది. అయితే కెప్లర్-452 భూమిలాంటి గ్రహమే అయినప్పటికీ మానవ నివాసానికి అనుకూలంగా లేదని గ్రహాంత జీవులపై పరిశోధన చేస్తున్న సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరస్ట్రియల్ ఇంటలిజెన్స్(సెటీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతిపెద్ద టెలిస్కోపు నిర్మిస్తోన్న చైనా అన్ని రంగాల్లో అమిత వేగంతో దూసుకుపోతున్న చైనా.. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ఈ దేశం ప్రపంచలోకెల్లా అతిపెద్ద రేడియో టెలిస్కోపు ‘ఫాస్ట్’ నిర్మిస్తోంది. 2011లో ప్రారంభించిన ఈ టెలిస్కోపు నిర్మాణం తుది దశలో ఉంది. వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనాలోని గిజో ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతంలో ఈ టెలిస్కోపును రూపొందిస్తున్నారు. పర్వతాల్లో గిన్నెఆకారపు ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు. 4,450 ప్యానెళ్లతో రూపొందించే ఈ టెలిస్కోపు రిఫ్లాక్టార్ వ్యాసం 500 మీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ప్యానెల్ 11 మీటర్ల భుజపొడవుగల సమబాహు త్రిభుజ ఆకారంలో ఉంటుంది. విశ్వం నుంచి వెలువడే చిన్నచిన్న రేడియో తరంగాలను సైతం ఈ టెలిస్కోపు గుర్తించగలదని ఫాస్ట్ ప్రాజెక్ట్ చీఫ్ సైంటిస్ట్ నాన్ రెండాంగ్ తెలిపారు. బృహస్పతి ఉపగ్రహాలపై కూడా.. ప్లూటో మిషన్ విజయమిచ్చిన ఉత్సాహంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) బృహస్పతి, శని గ్రహాల ఉపగ్రహాలపైన గ్రహాంత జీవుల అన్వేషణ కోసం అంతరిక్ష నౌకలను పంపించాలని భావిస్తోంది. మంచు చంద్రులుగా పేరొందిన టైటాన్ సహా మరో మూడు ఉపగ్రహాలపై జీవం ఉనికి తెలుసుకునేందుకు విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌తో ఈఎస్ఏ చేతులు కలిపింది. 2022 నాటికి ఈ రెండు భారీ గ్రహాల ఉపగ్రహాలపై జీవం కోసం వేట సాగనుంది. ఈ ప్రాజెక్టుకు ‘జూస్’ (జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్) అనే పేరుపెట్టారు. 10 కోట్ల డాలర్ల విరాళం.. గ్రహాంతర జీవుల అన్వేషణకు మరింత ఊతమిచ్చేందుకు రష్యా బిలియనీర్ మిల్నర్ ఏకంగా 10 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. మిల్నర్ తన ప్రాజెక్టుకు ‘బ్రేక్ థ్రూ లిజన్’ అనే పేరు పెట్టారు. విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌తో కలసి ఈ ప్రాజెక్టుపై మిల్నర్ ఇటీవల లండన్‌లో ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో హాకింగ్ సలహాదారుగా వ్యవహరించనున్నారు. గ్రహాంతర జీవులకు అర్థమయ్యే విధంగా సందేశాన్ని పంపిన వారికి మిల్నర్ 10 లక్షల అమెరికన్ డాలర్లను బహుమతిగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో మిల్నర్ ఎంపిక చేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపుల సాయంతో పదేళ్లపాటు గ్రహాంత జీవుల అన్వేషణ చేపడుతారు. అవి వెలువరించే రేడియో సంకేతాల కోసం టెలిస్కోపుల సహాయంతో శోధిస్తారు. ఏనీ డౌట్స్? గ్రహాంత జీవులు, కృష్ణబిలాల గురించి ఎలాంటి సందేహాలున్నా సోషల్ నెట్వర్కింగ్ సైట్ రెడిట్ ద్వారా విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు. కృత్రిమ మేధస్సు, డార్క్‌మేటర్, గ్రహాంత జీవులు.. సైన్స్ సంబంధిత విషయాల్లో ఎలాంటి సందేహలున్నా, రెడిట్ నిర్వహిస్తోన్న ఆస్క్ మీ ఎనీథింగ్(ఏఎంఏ) కార్యక్రమం ద్వారా జవాబులు తెలుసుకోచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా..జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకు రెడిట్డాట్కమ్/ఆర్/సైన్స్‌కి మీ ప్రశ్నలు పంపాలి. కొన్ని వారాల్లో హాకింగ్ నుంచి మీ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.