సౌర కుటుంబానికి అవతల.. సప్త గ్రహ కుటుంబం! | Kepler 385: Seven Planets Larger Than Earth Discovered | Sakshi
Sakshi News home page

సౌర కుటుంబానికి అవతల.. సప్త గ్రహ కుటుంబం!

Published Tue, Nov 7 2023 3:11 PM | Last Updated on Tue, Nov 7 2023 3:26 PM

Kepler 385: Seven Planets Larger Than Earth Discovered - Sakshi

నిన్న మొన్నటివరకూ సౌర కుటుంబానికి అవతల ఇంకో గ్రహం ఉందంటేనే నమ్మేవారు కాదు. కానీ. ఇప్పుడు ఇలాంటి ఎక్సోప్లానెట్లు కొన్ని వేలు ఉన్నాయన్న విషయం సుస్పష్టమైంది. మరి.. ఇన్ని వేల గ్రహాల్లో భూమిని పోలినవి? మన సౌరకుటుంబం మాదిరిగా ఉన్నవి ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకూ సమాధానం అవుననే. కాకపోతే తాజాగా ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. అదేమిటో తెలుసా? సప్త గ్రహ కుటుంబం! భూమికి కొన్ని రెట్లు ఎక్కువ పరిమాణమున్న ఏడు గ్రహాలు ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూంటాయి ఇందులో!

సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయన్నది కాసేపు పక్కనబెడదాం. విశ్వం మొత్తమ్మీద ఎన్ని ఉన్నాయంటే కచ్చితమైన సమాధానమైతే తెలియదు. కానీ.. ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా మన గ్రహ వ్యవస్థకు ఆవల గ్రహాలెన్ని ఉన్నాయి? వాటిల్లో భూమిని పోలినవి ఎన్ని? జీవించే పరిస్థితులు ఉన్నవాటి సంఖ్య ఎంత? మాతృనక్షత్రానికి (మనకు సూర్యుడు) ఎంత దూరంలో గ్రహాలు తిరుగుతున్నాయి? అన్న అనేక అంశాలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2009లో కెప్లర్‌ మిషన్‌ను ప్రయోగించింది. అంతరిక్షంలో ఉంటూ మన పాలపుంతలో భూమి సైజున్న గ్రహాలు ఎన్ని ఉన్నాయో చూడటం ఈ టెలిస్కోపు లక్ష్యం. తొమ్మిదేళ్లపాటు ఈ టెలిస్కోపు అంతరిక్షంలోని ఓ చిన్న భాగాన్ని మాత్రమే పరిశీలించి మన పాలపుంతలోనే కనీసం కొన్ని వందల కోట్ల ఎక్సోప్లానెట్లు ఉన్నాయని తేల్చింది. 2009 మార్చి ఆరవ తేదీన నింగికి ఎగిసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ కెప్లర్‌ టెలిస్కోపు వీటిల్లో ఐదు వేలకుపైగా గ్రహాలను గుర్తించింది కూడా!

ట్రాపిస్ట్‌-1లోనూ ఏడు గ్రహాలు...
కెప్లర్‌ గుర్తించి అనేకానేక గ్రహ వ్యవస్థల్లో ట్రాపిస్ట్‌-1 ఒకటి. భూమికి సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుందీ వ్యవస్థ. ఓ రెడ్‌ డ్వార్ఫ్‌ నక్షత్రం (మన సూర్యుడి సైజులో 0.8 - 0.6 శాతం సైజు మాత్రమే ఉండే నక్షత్రాలు) చుట్టూ భూమి సైజున​ ఏడు గ్రహాలతో ఏర్పడింది ఇది. ఈ రెడ్‌ డ్వార్ఫ్‌ నక్షత్రాలు మన సూర్యుడి మాదిరి అంత ప్రకాశవంతంగా ఏమీ ఉండవు. మన పాలపుంతలో అనేక రకాల నక్షత్రాలు ఉన్నా ఈ రెడ్‌ డ్వార్ఫ్‌ రకంవి ఎక్కువగా ఉన్నాయని అంచనా. ట్రాపిస్ట్‌-1లోని ఏడు గ్రహాల్లోనూ నీళ్లు ఉండేందుకు అవకాశం ఉందని నాసా చెబుతోంది. స్పీట్జర్‌, కెప్లర్‌, హబుల్‌.. తాజాగా జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపుల సాయంతో ఈ గ్రహ వ్యవస్థను ఇప్పటికే క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

తాజాగా ఇంకో సప్తగ్రహ వ్యవస్థ...
కెప్లర్‌ టెలిస్కోపు ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉండగా... తాజాగా దీనిద్వారా ఇంకో సప్తగ్రహ వ్యవస్థ గురించి తెలిసింది. కాకపోతే ఇందులో ట్రాపిస్ట్‌-1లో మాదిరిగా భూమి కంటే పెద్ద సైజున్న గ్రహాలు ఉండటం విశేషం. ఈ సరికొత్త గ్రహ వ్యవస్థను ‘కెప్లర్‌-385’ అని పిలుస్తున్నారు. భూమికి సుమారు వెయ్యి కాంతి సంత్సరాల దూరంలో ఉందీ వ్యవస్థ. భూమి సైజు కంటే 1.3 రెట్ల నుంచి 2.5 రెట్లు ఎక్కువ సైజుండే గ్రహాలను సూపర్‌ ఎర్త్‌లతో కూడి ఉంది ఇది. ఈ గ్రహాలకు... దాని మాతృ నక్షత్రానికి మధ్య ఉన్న దూరం మన సూర్యుడికి, బుధ గ్రహానికి మధ్య ఉన్నంత దూరం!
చదవండి: ఉపన్యాసం వద్దు.. ట్రంప్‌పై న్యాయమూర్తి ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement