వాళ్లు ఎక్కడున్నారో? | aliens issue is not come to conclusion | Sakshi
Sakshi News home page

వాళ్లు ఎక్కడున్నారో?

Published Tue, Jul 28 2015 9:40 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

వాళ్లు ఎక్కడున్నారో?

వాళ్లు ఎక్కడున్నారో?

ఈ అనంత విశ్వంలో మనకు తెలిసి భూమిపై మాత్రమే జీవం ఉంది! మరే ఇతర గ్రహంపై జీవం ఆనవాలు ఇప్పటివరకు కనుగొలేదు. మానవుని కంటే ఎన్నోరెట్లు మేధస్సు కలిగిన గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా? లేవా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలు శాస్త్రవేత్తలతోపాటు సామాన్య మానవులకు సైతం ఆసక్తి కలిగిస్తున్న అంశాలు. ఏదేమైనప్పటికీ ఏలియన్స్ ఉనికిని కనిపెట్టే దిశగా వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ అంశంపై అనేక దేశాలు తమ పరిశోధలను వేగిరం చేశాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతర జీవుల ఉనికికి ఊతమిస్తున్న అంశాలు, వాటి అన్వేషణకు చేపడుతన్న చర్యలు..వంటి విశేషాలపై ఫోకస్..
 
ఊతమిస్తున్న ఎర్త్-2 డిస్కవరీ?
కెప్లర్ టెలిస్కోపు సహాయంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అచ్చం భూమిని పోలిన కొత్త గ్రహాన్ని కనిపెట్టింది. దీనికి కెప్లర్-452 అని పేరు పెట్టారు. దీన్ని ఎర్త్-2 అని కూడా పిలుస్తారు. చైనా ట్వీటర్‌గా పిలిచే ‘సినా వైబో’లో ఈ డిస్కవరీ పట్ల ప్రజలు విశేషంగా స్పందించారు. 4.4 కోట్ల మంది చైనీయులు ఈ డిస్కవరీపట్ల ఉత్సుకతను ప్రదర్శించారు. 90 వేల మంది దీనిపై ఆన్‌లైన్ చర్చలో పాల్గొన్నారు. ఈ విశ్వంలో మానవులు మాత్రమే కాకుండా ఇతర జీవులు జీవించడానికి ఆస్కారముందనేదుంకు ఈ డిస్కవరీ నిదర్శనమని చైనీయులు నమ్మారు. దీనిపై చైనా మీడియా కూడా హడావుడి చేసేసింది. అయితే  కెప్లర్-452  భూమిలాంటి గ్రహమే అయినప్పటికీ మానవ నివాసానికి అనుకూలంగా లేదని గ్రహాంత జీవులపై పరిశోధన చేస్తున్న సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరస్ట్రియల్ ఇంటలిజెన్స్(సెటీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
అతిపెద్ద టెలిస్కోపు నిర్మిస్తోన్న చైనా
అన్ని రంగాల్లో అమిత వేగంతో దూసుకుపోతున్న చైనా.. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ఈ దేశం ప్రపంచలోకెల్లా అతిపెద్ద రేడియో టెలిస్కోపు ‘ఫాస్ట్’ నిర్మిస్తోంది. 2011లో ప్రారంభించిన ఈ టెలిస్కోపు నిర్మాణం తుది దశలో ఉంది. వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనాలోని గిజో ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతంలో ఈ టెలిస్కోపును రూపొందిస్తున్నారు. పర్వతాల్లో గిన్నెఆకారపు ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు. 4,450 ప్యానెళ్లతో రూపొందించే ఈ టెలిస్కోపు రిఫ్లాక్టార్ వ్యాసం 500 మీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ప్యానెల్ 11 మీటర్ల భుజపొడవుగల సమబాహు త్రిభుజ ఆకారంలో ఉంటుంది. విశ్వం నుంచి వెలువడే చిన్నచిన్న రేడియో తరంగాలను సైతం ఈ టెలిస్కోపు గుర్తించగలదని ఫాస్ట్ ప్రాజెక్ట్ చీఫ్ సైంటిస్ట్ నాన్ రెండాంగ్ తెలిపారు.
 
బృహస్పతి ఉపగ్రహాలపై కూడా..
ప్లూటో మిషన్ విజయమిచ్చిన ఉత్సాహంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)  బృహస్పతి, శని గ్రహాల ఉపగ్రహాలపైన గ్రహాంత జీవుల అన్వేషణ కోసం అంతరిక్ష నౌకలను పంపించాలని భావిస్తోంది. మంచు చంద్రులుగా పేరొందిన టైటాన్ సహా మరో మూడు ఉపగ్రహాలపై జీవం ఉనికి తెలుసుకునేందుకు విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌తో ఈఎస్‌ఏ చేతులు కలిపింది. 2022 నాటికి ఈ రెండు భారీ గ్రహాల ఉపగ్రహాలపై జీవం కోసం వేట సాగనుంది. ఈ ప్రాజెక్టుకు ‘జూస్’ (జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్) అనే పేరుపెట్టారు.
 
10 కోట్ల డాలర్ల విరాళం..
గ్రహాంతర జీవుల అన్వేషణకు మరింత ఊతమిచ్చేందుకు రష్యా బిలియనీర్ మిల్నర్ ఏకంగా 10 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. మిల్నర్ తన ప్రాజెక్టుకు ‘బ్రేక్ థ్రూ లిజన్’ అనే పేరు పెట్టారు. విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌తో కలసి ఈ ప్రాజెక్టుపై మిల్నర్ ఇటీవల లండన్‌లో ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో హాకింగ్ సలహాదారుగా వ్యవహరించనున్నారు. గ్రహాంతర జీవులకు అర్థమయ్యే విధంగా సందేశాన్ని పంపిన వారికి  మిల్నర్ 10 లక్షల అమెరికన్ డాలర్లను బహుమతిగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో మిల్నర్ ఎంపిక చేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపుల సాయంతో పదేళ్లపాటు గ్రహాంత జీవుల అన్వేషణ చేపడుతారు. అవి వెలువరించే రేడియో సంకేతాల కోసం టెలిస్కోపుల సహాయంతో శోధిస్తారు.
 
ఏనీ డౌట్స్?
గ్రహాంత జీవులు, కృష్ణబిలాల గురించి ఎలాంటి సందేహాలున్నా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ రెడిట్ ద్వారా విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు. కృత్రిమ మేధస్సు, డార్క్‌మేటర్, గ్రహాంత జీవులు.. సైన్స్ సంబంధిత విషయాల్లో ఎలాంటి సందేహలున్నా, రెడిట్ నిర్వహిస్తోన్న ఆస్క్ మీ ఎనీథింగ్(ఏఎంఏ) కార్యక్రమం ద్వారా జవాబులు తెలుసుకోచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా..జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకు రెడిట్‌డాట్‌కమ్/ఆర్/సైన్స్‌కి మీ ప్రశ్నలు పంపాలి. కొన్ని వారాల్లో హాకింగ్ నుంచి మీ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement