ఇస్లామాబాద్: పాకిస్థాన్ పదవీచ్యుత అధ్యక్షుడు నవాజ్ షరీఫ్, ఆయన కూతురు, అల్లుడికి షాక్ తగిలింది. అవినీతి కేసులో వారిపై నమోదైన నేరాభియోగాలను ఖరారు చేస్తూ.. ఇస్లామాబాద్‌లోని అవినీతి నిరోధక కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది.
67 ఏళ్ల షరీఫ్, ఆయన కూతురు మరియమ్ నవాజ్, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ మహమ్మద్ సఫ్దార్‌లకు లండన్‌లో అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ జాతీయ జవాబుదారీ బ్యూరో (ఎన్‌ఏబీ) అభియోగాలు మోపింది. ఈ అభియోగాలను ఖరారుచేస్తూ తాజాగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. షరీఫ్, ఆయన తరఫు న్యాయవాది ఖవాజ హారిస్ దేశంలో లేని సమయంలో ఈ కీలక ఆదేశాలు వెలువడటం గమనార్హం.
తమకు లండన్‌లో అక్రమాస్తులు లేవని, తమపై వచ్చిన అభియోగాలను కొట్టివేయాలని ఇప్పటికే ఈ ముగ్గురు నిందితులు కోర్టును అభ్యర్థించారు. అంతేకాకుండా కోర్టు ఇండిక్ట్‌మెంట్ ప్రొసీడింగ్స్‌ను వాయిదా వేయాలంటూ సఫ్దార్ తరఫు న్యాయవాది అంజద్ పర్వేజ్ కోరారు. వీరి అభ్యర్థనలను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.
షరీఫ్, ఆయన కుటుంబసభ్యులపై ఎన్ఏబీ ఇప్పటికే పలు అవినీతి కేసులను నమోదుచేసింది. ఈ కేసులన్నింటినీ కలిపి విచారించాలంటూ షరీఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించకముందే.. ఈ మేరకు గట్టి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. ఈ అవినీతి ఆరోపణల కారణంగా ఆయన ఇటీవల ప్రధాని పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment