‘అంతిక్యేత్ర’ దగ్గర్లోనే మానవ పుర్రె..!
మధ్యధరా సముద్ర ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో రెండు వేల ఏళ్ల పురాతనమైన పుర్రె ఒకటి చెక్కు చెదరని స్థితిలో లభ్యమైంది. ఇందులో విశేషమేముంది.. ఇలాంటివి చాలా దొరుకుతుంటాయి కదా అనుకోవద్దు. ఎందుకంటే కొన్నేళ్ల కిందట ఇదే ప్రాంతంలో అతి పురాతనమైన ఓ కంప్యూటర్ లాంటి పరికరం లభించింది. గ్రీస్ దేశం సమీపంలో క్రీస్తు పూర్వం 65 వ సంవత్సరానికి చెందినదిగా భావిస్తున్న ఓ నౌకలో కొన్నేళ్ల కిందట కంప్యూటర్ లాంటి పరికరం ఒకటి లభించిన విషయం తెలిసిందే. దీనికి ‘అంతిక్యేత్ర’ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన ఉడ్స్‌హోల్ ఓషనోగ్రఫిక్ ఇన్‌స్టిట్యూషన్ తవ్వకాలు సాగిస్తోంది.
గత నెల 31న బ్రెండన్ ఫాలే తదితరులు నౌక శిథిలాలను అన్వేషిస్తుండగా దవడ ఎముకలతోపాటు అన్ని భాగాలు పాడవకుండా ఉన్న ఓ పుర్రె లభించింది. దీంతో పాటు చేతులు, ఛాతీ ఎముకలు కూడా కొన్ని లభించాయి. సాధారణంగా నౌక శిథిలాల్లోని మానవ అవశేషాలను చేపలు కొన్ని దశాబ్దాల్లో పూర్తిగా తినేస్తుంటాయని, పుర్రె చెక్కు చెదరకుండా దొరకడం విశేషమని బ్రెండన్ అంటున్నారు. ఇవి ఓ యువకుడివి కావచ్చని ప్రాథమిక పరిశీలన ద్వారా ఓ నిపుణుడు తెలిపారు. ఈ పుర్రె నుంచి డీఎన్‌ఏను సేకరించగలిగితే నౌక గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని నిపుణుల అంచనా.