ఫొటోలో ఉన్న పెద్దాయన పేరు ఆశ్రిత ఫర్మాన్. ఆయనచేతిలో ఉన్నవేంటో తెలుసా గిన్నిస్ రికార్డులు. అవన్నీ గిన్నిస్ రికార్డులా.. లేదా ఒక్క దాన్నే జిరాక్స్ తీసుకున్నాడా ఏంటి అనుకుంటున్నారా? కాదండీ ఆ రికార్డులన్నీ ఆయనవే. అమ్మో అన్ని గిన్నిస్ రికార్డులా..! జీవితంలో ఒక్క రికార్డుకే నానా తంటాలు పడతారు.. అలాంటిది అన్ని రికార్డులు సాధించాడా.. గ్రేట్ కదా.. అమెరికాకు చెందిన ఈయన పేరు మీద ప్రస్తుతానికి 226 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఒక్క గిన్నిస్ రికార్డు అయినా సాధించాలని అనుకునే వాడట.
అయితే శారీరకంగా అంతగా దృఢంగా ఉండకపోవడంతో అది సాధ్యం కాదని భావించేవాడట. అయితే 1978లో ఓ స్వామి ఇచ్చిన ధైర్యంతో తొలిసారిగా అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన 24 గంటల సైకిల్ రేసులో పాల్గొన్నాడు. కానీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ మరుసటి ఏడాదే 27 వేల జంపింగ్ జాక్స్ చేసి తొలి గిన్నిస్ రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు. అప్పటినుంచి వెనక్కి చూసుకోలేదు. ఎప్పుడూ వినూత్నమైన ఫీట్లు చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అలా దాదాపు 600 గిన్నిస్ రికార్డులను సాధించారు. ప్రస్తుతం ఆయన దగ్గర 226 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి.
అంటే వాటిని ఎవరూ ఇంకా అధిగమించలేదన్న మాట. తాజాగా ఒక్క నిమిషంలో 26 పుచ్చకాయలను తన ఉదరంపై పెట్టుకుని పగులగొట్టుకున్నాడు. ఇది కూడా రికార్డులోకెక్కింది. కంగారూ బంతిపై గెంతుకుంటూ ఎక్కువ దూరం వెళ్లడం.. పెద్ద బంతిపై ఎక్కువ సేపు నిలబడటం.. నీటిలో చిన్న బంతులను ఎగరేసి పట్టుకోవడం.. నీటిలోపల ఎక్సర్‌సైజ్ చేయడం.. నీటిలోపల సైకిల్ తొక్కడం ఇలా తనకు ఏది అనిపిస్తే దాన్ని కొద్ది రోజుల్లోనే నేర్చుకోవడం గిన్నిస్ రికార్డుల్లో తన పేరు రాసుకోవడం.. తన జీవితం మొత్తం ఇలా రికార్డులు సాధిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment