న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి చెందిన థౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని ఓ బార్‌లో గురువారం ఉదయం ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో పోలీస్ అధికారి, గన్‌మెన్ సహా 12 మంది మరణించారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున పబ్‌లోకి చొచ్చుకువచ్చిన దుండగుడు తొలుత హ్యాండ్‌గన్‌తో పలుమార్లు కాల్పులు జరిపిన తర్వాత పొగబాంబులు విసిరి మరోసారి కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఏబీసీ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. నిందితుడు 30 సార్లు కాల్పులు జరిపాడని, బార్ నుంచి అందరూ చెల్లాచెదురైన తర్వాత సైతం తనకు కాల్పుల శబ్ధం వినిపించిందని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.
కాలిఫోర్నియాలోని బోర్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్ అనే పబ్‌లో కాల్పులు జరిగాయని స్ధానిక సమాచార వెబ్‌సైట్ వెంచురా కంట్రీ స్టార్ పేర్కొంది. కాగా దుండగుడి కాల్పుల ఘటనపై స్ధానిక అగ్నిమాపక విభాగం ట్వీట్ చేసింది. ఘటనా ప్రదేశానికి ప్రజలు దూరంగా ఉండాలని, పలువురికి తీవ్రగాయాలయ్యాయని, పెద్దసంఖ్యలో అంబులెన్స్‌లు అవసరమని పేర్కొంది.
కాల్పుల కలకలం చోటుచేసుకున్న సమయంలో బోర్డర్‌లైన్ బార్‌లో పెద్దసంఖ్యలో యువకులున్నారని, ఘటన నేపథ్యంలో ఒకరిని ఒకరు గుర్తించిన అనంతరం హగ్ చేసుకుంటూ కనిపించిన వీడియోను వెంచురా కంట్రీ స్టార్ రిపోర్టర్ పోస్ట్ చేశారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. కాగా, అమెరికాలో స్కూళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు సహా బహిరంగ ప్రదేశాల్లో దుండగులు కాల్పులతో విరుచుకుపడుతున్న ఘటనలు పలుమార్లు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment