హ్యారీ బొల్‌మన్‌తో పెంపుడు పిల్లి ఉమా
కాన్‌బెర్రా : మనషుల్లో శాకాహారులు ఉండటం చాలా సహజం. అలా ఏళ్ల తరబడి మాంసం ముట్టకుండా కూరగాయలు తింటూ బతికేస్తుంటారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తాను పాటించే నియమాలను పెంపుడు జంతువు కూడా పాటించేలా చేశాడు. దీంతో కొంత మంది జంతుప్రేమికులు అతనిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కు చెందిన హ్యారీ బొల్‌మన్(53) పూర్తి శాకాహారి. గత 38 ఏళ్లుగా ముక్కముట్టకుండా కాలం గడుపుతున్నాడు. అయితే ఓ ఏడాది క్రితం ఓ పిల్లిని పెంచుకుందామని ఇంటికి తెచ్చుకున్నాడు. దానికి ఉమా అని పేరుపెట్టి దాన్ని కూడా పూర్తి శాకాహారిగా మార్చాడు.
ఈ విషయం అందరికి తెలిసిపోవటంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో హ్యారీ స్పందిస్తూ.. తాను చాలా ఏళ్లుగా శాకాహారిగా ఉన్నానని, గతంతో పెంచుకున్న కుక్కలను సైతం శాకాహారులుగానే పెంచానని తెలిపాడు. ప్రస్తుతం పెంచుకుంటున్న పిల్లి కూడా శాకాహారంతో చాలా ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నాడు. అయితే సరైన మోతాదులో జంతు సంబంధమైన ప్రోటీన్లు పిల్లికి లభించకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని పశు వైద్యాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment