మత పెద్దను ఆహ్వానించడంపై ప్రధాని విచారం
సిడ్నీ: స్వలింగ సంప్కరులను వ్యతిరేకించిన ఇస్లాం మత పెద్ద షేక్ షాడీ అల్సులీమాన్ ను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం పట్ల ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్బుల్ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక నివాసం కిరిబల్లి హౌస్ లో గురువారం నిర్వహించిన రంజాన్ విందుకు అల్సులీమాన్ తో పాటు పలువురు ముస్లిం పెద్దలు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో 2013లో స్వలింగ సంప్కరులకు వ్యతిరేకంగా అల్సులీమాన్ మాట్లాడిన వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. వాధ్యులు వ్యాప్తి చెందడానికి, సమాజం గతి తప్పడానికి స్వలింగ సంపర్కులు కారణమవుతున్నారని అల్సులీమాన్ అందులో పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా నేషనల్ ఇమామ్ ల సంఘానికి అధ్యక్షుడైన అల్సులీమాన్ చేసిన వ్యాఖ్యలను టర్నబుల్ ఖండించారు. బహుళ సంస్కృతులకు ఆలవాలమైన ఆస్ట్రేలియాలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదన్నారు. అల్సులీమాన్ చేసిన వ్యాఖ్యల గురించి ముందే తెలిసివుంటే ఆయనను విందుకు ఆహ్వానించేవాడిని కాదన్నారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం తొలిసారిగా ఇఫ్తార్ విందు నిర్వహించడం విశేషం.