
ప్రేమ - పెళ్లి- ఉరి
కాన్బెర్రా: ఆ ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. వధువు ఫ్యాబియంతి హెరెవిల్లా, వరుడు ఆండ్రూ చాన్. ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకుంటారు కదా.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మరోవారం రోజుల్లో ఉరి శిక్ష అమలు కాబోతున్న ఆండ్రూ చనిపోయే ముందు తమ ప్రేయసి వివాహం చేసుకోవాలనే చివరి కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే ఇక ఉరి శిక్ష తప్పదు అని తేలిపోవడంతో జైలులోనే పెళ్లి సిద్దమయ్యాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ చాన్ డ్రగ్ స్మగ్లింగ్ కేసులో జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఆండ్రూ జైన్, మ్యూరన్ సుకుమారన్ సహా మరో ఏడుగురు 8.2 కేజీల హెరాయన్, 3.1 మిలియన్ల డాలర్ల నగదును ఇండోనేషియాకు అక్రమంగా రవాణా చేస్తూ 2005లో అరెస్టయ్యారు. నేరం రుజువు కావడంతో ఆండ్రూకు మరణ శిక్ష ఖరారయ్యింది. బాలి నైన్ డ్రగ్ కేసుగా పిలిచే కేసులో ఆండ్రూతో తొమ్మిదిమందికి ఉరిశిక్ష ఖరారయ్యింది.
ఈ నేపథ్యంలోనే ప్రేమికులిద్దరూ ...ప్రస్తుతం ఆండ్రూ శిక్ష అనుభవిస్తున్న బేసి జైల్లో సోమవారం రాత్రి వివాహం చేసుకున్నారు. బంధువులు, ఇతర ఖైదీల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగిందని ఆండ్రూ సోదరుడు మిచెల్ తెలిపారు. ఇండోనేషియన్ ప్రభుత్వం ఈ శిక్షలను ఖరారు చేస్త ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు సమాచారం. వీరి ఉరి శిక్షలు ఈ వారంలో అమలు కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వీరి ఉరిశిక్షలను రద్దు చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, బంధువులు ఇటు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, అటు ఇండోనేషియా ప్రభుత్వానికి కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.