
ఆస్ట్రేలియా మహిళ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్‌చేస్తే..
వాషింగ్టన్: ఓ మహిళ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసిన పాపానికి, పోలీసుల కాల్పుల్లో తన ప్రాణాలే కోల్పోయింది. ఈ విషాదకర ఘటన అమెరికాలోని సౌత్ మిన్నెపోలిస్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబం వివరాల మేరకు.. ఆస్ట్రేలియాకు చెందిన జస్టిన్ రస్జెక్ అనే 40 ఏళ్ల మహిళ గడ మూడేళ్లుగా అమెరికాలోని మిన్నెపోలిస్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల ఆమె ఎంగేజ్‌మెంట్ అయింది. వచ్చే నెలలో అమెరికా వ్యాపారవేత్త డాన్ డామండ్(50) తో ఆమె వివాహం జరగనుంది. ఇంతలోనే విషాదం జరిగిందని డామండ్ కుమారుడు జక్ డామండ్ వాపోయాడు.
శనివారం జస్టిన్ రస్జెక్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. తమ పక్కింట్లో ఏదో గొడవ జరుగుతోందని త్వరగా రావాలంటూ ఎమర్జెన్సీ నెంబర్ 911కు రాత్రి 11 గంటలకు ఆమె కాల్ చేశారు. అరగంట తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద శబ్దాలు వస్తున్న వైపుగా వెళ్లిన ఇద్దరు పోలీసుల్లో ఒకరు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు తర్వాత అక్కడ ఎలాంటి అనుమానిత వ్యక్తులు కనిపించకపోవడంతో వారు వెళ్లిపోయారు. ఆదివారం కుమారుడు జక్‌తో పాటు డాన్ డామండ్ ఇంటికి వెళ్లిచూడగా రస్జెక్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది.
చుట్టుపక్కల వాళ్లను పిలవగా శనివారం రాత్రి ఇంటి సమీపంలో పోలీసులు కాల్పులు జరిపి వెళ్లిపోయారని చెప్పారు. పోలీసుల తొందరపాటు కారణంగా తాను తల్లి, ఓ మంచి స్నేహితురాలును కోల్పోయినట్లు జక్ డామండ్ కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు మద్దతుగా పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాలని విజ్ఞప్తి చేశాడు. పోలీసుల నుంచి తనకు జవాబులు రావాలని, జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరో తేలాల్సి ఉందని జక్ డామండ్ పేర్కొన్నాడు.