
డెన్‌పసర్(ఇండోనేసియా) : ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ఇండోనేసియా ప్రాంతంలో ప్రజలు మరోసారి భయాందోళనలు చెందుతున్నారు. బాలి తీరంలో గల అగ్నిపర్వతం మౌంట్ అగంగ్ మరికొద్ది గంటల్లో బద్దలు అవుతుందని సోమవారం ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడమే ఇందుకు కారణం. గత వారం రోజుల నుంచి మౌంట్ అగంగ్ నుంచి భారీగా స్మోక్ వెలుడుతున్నట్లు ప్రభుత్వ ప్రకటనలోని సారాంశం.
సోమవారం ఉదయం నుంచి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న స్మోక్ గాల్లోకి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నట్లు వివరించింది. అగ్నిపర్వత పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఇప్పటికే 40 వేల మంది తమ నివాసాలను వదిలేసి వెళ్లిపోగా.. మరో 60 వేల మందిని తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా బద్దలయ్యే సంకేతాలు ఉండటంతో బాలిలోని విమానాశ్రయాన్ని మూసేశారు. దీంతో పర్యాటకులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఇండోనేసియాలో దాదాపు 17 వేల చిన్నచిన్న దీవులు ఉన్నాయి. అంతేకాకుండా పసిఫిక్ సముద్ర తీరాల్లో టెక్టోనిక్ ప్లేట్లు తరచుగా ఢీ కొట్టుకునే ప్రదేశం కూడా ఇండోనేసియానే. అందుకే ఆ దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment