'ఆ దాడిని ఖండిస్తున్నా.. ఈ దాడి తెలియదు'
న్యూయార్క్: అఫ్గానిస్తాన్లోని భారత దౌత్యకార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఖండించారు. అదే సమయంలో భారత్లోని పంజాబ్ లోగల పఠాన్ కోట్ పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై మాత్రం స్పందించలేదు. ఆదివారం రాత్రి కొందరు ఉగ్రవాదులు అప్గానిస్తాన్లోని మజరీఈ షరీప్ నగరంలోని భారత దౌత్యకార్యాలయంపైకి దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ దాడిని భద్రతా బలగాలు సమర్ధంగా ఎదుర్కొన్నాయి.
దీనికి సంబంధించి బాన్ కీ మూన్ స్పందిస్తూ 'మజరీ ఈ షరీఫ్ లోగల భారత్ కార్యాలయంపై జరిగిన దాడి ముమ్మాటికి ఖండించాల్సినదే. అన్ని దేశాల్లోని అన్ని దేశాల దౌత్య కార్యాలయాలకు గట్టి భద్రత కల్పించాలని గతంలోనే నేను చెప్పాను' అని అన్నారు. పఠాన్ కోట్పై పాక్ ఉగ్రవాదుల దాడిపై మాత్రం 'దానిపైన నేను ప్రత్యేకంగా మాట్లాడిల్సింది ఏమీ లేదు. దానిపై మాట్లాడేందుకు నా వద్ద వివరాలు కూడా ఏమీ లేవు' అని బాన్ కీ మూన్ చెప్పినట్లు ఆయన వ్యక్తిగత అధికార ప్రతినిధి స్టీపెన్ దుజారిక్ చెప్పారు.