ఇదేమి ‘కటింగ్’ బాబూ! | barber james williams become a celebrity | Sakshi
Sakshi News home page

ఇదేమి ‘కటింగ్’ బాబూ!

Published Sun, Nov 8 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

ఇదేమి ‘కటింగ్’ బాబూ!

ఇదేమి ‘కటింగ్’ బాబూ!

సౌత్‌వేల్స్: చిన్నపిల్లలు సాధారణంగానే హెయిర్ సెలూన్లో కటింగ్ చేసుకోవాలంటే మారాం చేస్తారు, గోల చేస్తారు, ఏడుస్తారు, నానాయాగి చేస్తారు. వారికి కటింగ్ చేయాలంటే సెలూన్ వాడికి కూడా తలప్రాణం తోకకొస్తుంది. ఆదే ఆటిజం(మెదడు సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్న పిల్లలకు కటింగ్ చేయించాలన్నా, చేయాలన్నా దేవతలు దిగిరావాలి!
 ఈ బాధను భరించలేననుకొనే డెనైన్ డీవీస్ అనే ఓ తల్లి ఆటిజంతో బాధ పడుతున్న తన నాలుగేళ్ల కొడుకు మాసన్‌కు 18 నెలల నుంచి కటింగ్ చేయించలేదు. మాసన్ జుట్టు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది. క్షణం కూడా నిలకడగా కూర్చోని మాసన్  నిద్రలో ఉన్నప్పుడు కొంచెం, కొంచెం జుట్టు కత్తిరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మేల్కొన్నాక మాసన్ తన జుట్టును చూసుకొని ఇల్లుపీకి  పందిరేసేవాడట.

సౌత్‌వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్‌లో నివసిస్తున్న డీ వీస్, చిన్న పిల్లలకు అతి నైపుణ్యంతో హేర్ కట్‌చేసే బార్బర్ కోసం వాకబు చేసింది. జేమ్స్ విలియమ్స్ అనే 26 ఏళ్ల బార్బర్ అందులో స్పెషలిస్ట్ అని తెలుసుకుంది. తన పార్టనర్ జామీ లెవీస్‌తో కలసి బాబును తీసుకొని ఓ రోజు ఆ బార్బర్ దగ్గరకు వెళ్లింది. ఆటిజమ్‌తో బాధపడుతున్న పిల్లలకు హేర్ కటింగ్ చేయడం అంత ఈజీ కాదని, ముందుగా వారితో చనువు పెంచుకోవాల్సి ఉంటుందని బార్బర్ విలియమ్స్ సూచించారు. వారికిచ్చిన మాట మేరకు బార్బర్ ప్రతిరోజు  సెలూన్ తెరవడానికి ముందు ఆ బాలుడు ఇంటికెళ్లి బాలుడితో స్నేహం చేయడం ప్రారంభించారు.

అలా ఒకరోజు ఇంటికొచ్చేసరికి బాలుడు నేలమీద పడుకొని తన తల్లి సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న బార్బర్ విలియమ్స్ తాను కూడా బోర్లా నేలమీద పడుకొని బాలుడికి హేర్ కటింగ్ చేశారు. ఈ దృశ్యాలను మాసన్ తండ్రి లెవీస్ ఫొటోలుతీసి  ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలకు ఇప్పటివరకు 25వేల మంది లైక్స్ కొట్టగా, ఐదేవేల మంది షేర్ చేసుకున్నారు. ఒక్కసారిగా ఆన్‌లైన్ బార్బర్ విలియమ్స్ సెలబ్రిటిగా మారిపోయారు.

తమ పిల్లలకు హెయిర్ కట్ చేయాలంటూ బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి రిక్వెస్టులు పెరిగాయి. ముఖ్యంగా ఆటిజమ్‌తో బాధ పడుతున్న పిల్లల తల్లిదండ్రులే వారిలో ఎక్కువగా ఉన్నారు. ‘నా వృత్తిని నేను నిర్వహించాను. ఇందులో గొప్పతనమేమి లేదు. కాకపోతే ఊహించని విధంగా డిమాండ్ పెరగడం ఆనందంగా ఉంది’ అని బార్బర్ వ్యాఖ్యానించారు. కటింగ్ అనంతరం అద్దంలో తన ముఖం చూసుకున్న మాసన్ అసలు ఏడ్వకపోగా తనపని ముగించుకొని వెళుతున్న బార్బర్ విలియమ్స్ వద్దకు వెళ్లి బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడని తల్లీ డీవీస్ మురిపింగా తెలిపింది. బార్బర్‌కు థాంక్స్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement