
రోబోకు రెక్కలొచ్చాయి...
గబ్బిలాల గురించి మీరు వినే ఉంటారు. రెక్కలు విప్పుకుని పైకి, కిందకు అల్లాడిస్తూ కదిలివెళ్లే గబ్బిలాల మాదిరిగానే ఫొటోలో కనిపించే రోబో కూడా పని చేస్తుంది. అయితే ఏంటి? అని కొట్టిపారేయవద్దు. ఇలా రెక్కలు కొట్టుకోగల రోబోను తయారుచేయడం ఇదే మొదటిసారి కాగా.. దీనివల్ల అనేకానేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు దీన్ని తయారు చేసిన కాల్‌టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. గాల్లో ఉండేందుకు డ్రోన్‌ల మాదిరిగా ఇంజిన్లు నిత్యం ఆన్‌లో ఉంచుకోవాల్సిన అవసరం లేకపోవడం వీటిల్లో ఒకటి మాత్రమే.
అతితక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లడం రెక్కల రోబోతోనే సాధ్యం. కేవలం 93 గ్రాముల బరువు ఉండే ఈ రోబోను చిన్న చిన్న ప్రదేశాల్లోనూ సులువుగా తిప్పవచ్చు. దీని రెక్కలు దాదాపు ఒక అడుగు విస్తీర్ణంలో విచ్చుకుంటాయి. గబ్బిలాల మాదిరిగానే తన రెక్కల మధ్యలో ఉండే అనేక కీళ్లను కదిలిస్తూ ముందుకు కదులుతుంది ఇది. గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా ఈ రెక్కలకు 56 మైక్రాన్ల మందమున్న ప్రత్యేకమైన సిలికాన్ పదార్థంతో తయారు చేశారు.
కార్లకు రెక్కలు వచ్చేందుకు... నిలువుగా పైకెగరి గమ్యంవైపు దూసుకెళ్లేందుకు ఇంక ఎక్కువ రోజులు పట్టదు. ఎందుకంటారా? ఇప్పటికే కొన్ని ఎగిరే కార్లు మార్కెట్‌లోకి వచ్చేసేందుకు సిద్ధమవుతూండగా.. జెట్‌ప్యాక్ ఏవియేషన్ అనే సంస్థ తాజాగా ఫొటోలో చూపినట్టు ఇంకో దాన్ని సిద్ధం చేస్తోంది మరి. మనుషులు నిలువుగా పైకి ఎగరేలా చేసేందుకు జెట్‌ప్యాక్‌ను సిద్ధం చేసింది ఈ కంపెనీనే. విషయం ఏమిటంటే.. ఒకవైపు బ్యాటరీల సామర్థ్యం పెరిగిపోతోంది. ఇంకోవైపు సెన్సర్లు, ఎలక్ట్రిక్ మోటర్ల ఖరీదు తగ్గిపోతోంది. ఒకప్పుడు అందుబాటులో లేని అనేక టెక్నాలజీలు ఇప్పుడు అందరికీ చేరువయ్యాయి.
ఈ నేపథ్యంలో జెట్ ఏవియేషన్స్ ఎగిరే కారు తయారీకి నడుం బిగించింది. మొత్తం ఆరు రోటర్లతో కూడిన ఈ ఎగిరే కారులో ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేస్తుంది. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని తయారు చేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఐదేళ్లలో ఈ సరికొత్త ఎగిరే కారు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.