30 సెకన్లలోనే బ్యాటరీ ఫుల్!
లండన్: మీ ఫోన్‌లో చార్జింగ్ చాలా తక్కువగా ఉంది.. అత్యవసరంగా బయటకు వెళ్లాలి.. అక్కడెక్కడా ఫోన్‌ను చార్జింగ్ చేసుకునే సౌకర్యం లేదు.. ఇలాంటి పరిస్థితి వస్తే చాలా చికాకుగా ఉంటుంది కదూ.. అదేదో కేవలం కొద్ది సెకన్లలోనే చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటే..!? చాలా బాగుంటుంది. ఇలా కేవలం 30 సెకన్లలోనే పూర్తిగా చార్జ్ అయ్యే సరికొత్త బ్యాటరీని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన ‘స్టోర్‌డాట్’ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రెండు నానో మీటర్ల పొడవున్న ఆర్గానిక్ స్పటికాల సహాయంతో..
బ్యాటరీల్లో అతి చిన్న చుక్కల వంటి నిర్మాణాలను ఏర్పాటు చేశామని స్టోర్‌డాట్ సీఈవో డొరోన్ మేర్స్‌డార్ఫ్ తెలిపారు. దీనివల్ల బ్యాటరీల్లో కాంతి వేగంతో విద్యుత్ ప్రవహిస్తుందని, అత్యంత వేగంగా చార్జింగ్ అవుతుందని తెలిపారు. ఇటీవల టెల్ అవీవ్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లో అమర్చగల బ్యాటరీని కేవలం 26 సెకన్లలో చార్జింగ్ చేసినట్లు చెప్పారు