ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్ : మామూలు సంభాషణల ద్వారా నోటి నుంచి వెలువడే చిన్న చిన్న తుంపరల కారణంగా కరోనా వైరస్ ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. మాట్లాడటం ద్వారా నోటి నుంచి బయటకు వెలువడే తుంపరలు దాదాపు ఎనిమిది, అంతకంటే ఎక్కువ నిమిషాల పాటు గాలిలో ఉంటాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ డైజస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ అండ్ ది యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘‘ హైలీ సెన్సిటివ్ లేజర్ లైట్ స్కాటిరింగ్ అబ్జర్వేషన్’’ పద్దతి ద్వారా వీరు పరిశోధనలు జరపగా.. బిగ్గరగా మాట్లాడటం వల్ల నోటి నుంచి ఒక సెకనుకు వేలాది తుంపరలు వెలువడతాయని తేలింది. ఈ పరిశోధనల్లో కరోనా, ఇతర వైరస్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించకపోయినప్పటికి సంభాషణల ద్వారా వెలువడ్డ తుంపరలలోని క్రిముల కారణంగా ఇన్‌ఫెక్షన్‌లు సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. (కరోనా మహమ్మారి సోకాలని..)
శాస్త్రవేత్త న్యూమాన్ మాట్లాడుతూ.. ‘‘ సంభాషణల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న దానిపై మేము ప్రత్యేకంగా పరిశోధనలు జరపలేదు. కానీ, గాల్లోని తుంపరల్లో ఉన్న వైరస్‌ల కారణంగా ఏ ఇన్‌ఫెక్షన్ సోకడానికైనా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కూడా మాస్కులు ధరించని వారిపై ప్రభావం ఉంటుంది. మాస్కులు లేకుండా బిగ్గరగా మాట్లాడేవాళ్లు ఇతరులను కచ్చితంగా ప్రమాదంలో పడేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment