
ఆ రాక్షసబల్లి వస్తుంటే.. ఏడంతస్తుల మేడ నడిచొచ్చినట్టుండే!
మనిషి కన్నా పొడవుగా.. పెద్ద సైజు మొద్దులా కనిపిస్తున్న ఇది ఓ రాక్షసబల్లి(డైనోసార్)కి చెందిన తొడ ఎముక. అర్జెంటీనాలోని పాటగోనియాకు 250 కి.మీ. దూరంలో గల లా ఫ్లెచా ఎడారి వద్ద దీనితోపాటు మొత్తం 150 ఎముకలను పురాజీవ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడ దొరికిన భారీ ఎముకలను బట్టి.. ఇవి పొడవైన మెడ, తోకను కలిగి ఉండి, నాలుగు కాళ్లతో నడిచే టిటానోసార్ జాతి డైనోసార్‌కు చెందినవిగా నిర్ధారించారు. ఈ జాతి రాక్షసబల్లులు సుమారు 9.50 కోట్ల ఏళ్ల క్రితం క్రిటేసియస్ యుగం చివరికాలంలో భూమిపై సంచరించాయట. దీని ఎముకల్లో చిక్కుకుపోయిన రాళ్లను బట్టి కాలాన్ని అంచనా వేశారు.
అయితే ఇప్పటిదాకా లభ్యమైన శిలాజాలను బట్టిచూస్తే.. ఇదే అతిపెద్ద రాక్షసబల్లి అట. దీని సైజు ఏకంగా 14 ఆఫ్రికన్ ఏనుగులంత ఉండేదట. నోటి నుంచి తోక దాకా 40 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తు, 77 టన్నుల బరువు ఉండే ఈ డైనోసార్ కదులుతుంటే.. దాదాపుగా ఏడంతస్తుల మేడ నడిచొచ్చినట్టుగా ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంతకుముందు పాటగోనియా ప్రాంతంలోనే దొరికిన శిలాజాలను బట్టి.. అర్జెంటినోసారస్ అనే రాక్షసబల్లే అతిపెద్దది అని గుర్తించారు. తాజాగా ఆ రికార్డును అధిగమించేసిన ఈ రాక్షసబల్లికి ఇంకా పేరుపెట్టలేదు. అన్నట్టూ... ఈ రాక్షసబల్లి పూర్తిగా శాకాహారమే తీసుకునేదట.