
'క్లింటన్ కూడా మా ఆయనలాంటివాడే!'
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తాజా బాగోతం ఒకటి వెలుగుచూసింది. తన కన్నా 17 ఏళ్ల పెద్దదైన జాక్వలిన్ కెన్నడీని క్లింటన్ ప్రలోభపెట్టాలని చూశాడట. ఆమె నిరాకరిస్తున్నా.. బలవంతంగా ఆమెతో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించాడట. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ భార్య అయిన జాక్వలిన్ తాజా పుస్తకంలో ఈ విషయాన్ని వివరించారు.
అప్పుడు తన వయస్సు 60 ఏళ్లు అని, న్యూయార్క్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన క్లింటన్ తనను ప్రలోభపెట్టాలని చూశాడని, దీంతో తమ మధ్య 'కుస్తీ పోటీ'లాంటి పెనుగులాట జరిగిందని, అతి కష్టం మీద అతన్ని దూరం తోసేసి ఈ అఘాయిత్యం నుంచి బయటపడ్డానని జాక్వలిన్ పేర్కొన్నట్టు ఈ పుస్తకం తెలిపింది. 'బిల్ అండ్ హ్యారీ: సో దిస్ ఈజ్ దట్ థింగ్ కాల్డ్ లవ్' అనే పుస్తకంలో రచయితలు డార్విన్ పార్టర్, డాన్‌ఫోర్త్ ప్రిన్స్ ఈ విషయాలను వెల్లడించారు. క్లింటన్ కూడా తన భర్త జాన్ ఎఫ్ కెన్నడీ లాంటివాడేనని, లైంగిక సంబంధాలలో పేరుమోసిన ఇద్దరూ 'నో' అనే సమాధానం వస్తే సహించేవారు కాదని జాక్వలిన్ ఓ సందర్భంలో తన స్నేహితురాలితో చెప్పిందని పుస్తకంలో పేర్కొన్నారు.
బిల్ క్లింటన్ చిన్నప్పటి నుంచి జాన్ ఎఫ్ కెన్నడీని విపరీతంగా అభిమానించేవాడు. 1963లో వైట్‌హౌస్‌కు వచ్చి.. అప్పటి అధ్యక్షుడైన కెన్నడీని కలిశాడు కూడా. ఆ తర్వాత 1992లో క్లింటన్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ఆయనకు దివంగత కెన్నడీ భార్య జాక్వలిన్ బాగా సహాయం చేశారు. అయితే, ఆ తర్వాత వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఈ పుస్తకం తెలిపింది.