బయోస్టీల్ జోళ్లు!
వాడేసిన తరువాత కాలిజోళ్లు కుళ్లిపోయి... భూమిలోకి కలిసిపోయేందుకు ఎంతకాలం పడుతుందో మీకు తెలుసా? కొంచెం అటూ ఇటుగా 80 ఏళ్లు! ఈలోపు అక్కడి నేల, నీరు మొత్తం కలుషితమైపోవాల్సిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక మార్గం మా కాలిజోళ్లు అంటోంది అడిడాస్. ఫొటోలో కనిపిస్తున్నాయే... అవి అలాంటివే. జర్మనీలోని ఓ కంపెనీ తయారు చేసిన పట్టు లాంటి బయోప్లాస్టిక్ పదార్థంతో ఇది తయారవుతుంది. బయోస్టీల్ అని పిలుస్తున్న ఈ పదార్థం పేరుకు తగ్గట్టుగానే ఉక్కు మాదిరిగా దృఢంగా ఉంటూనే.. వాడేసిన తరువాత వేగంగా కుళ్లిపోయి మట్టిలో కలిసిపోతుంది.
అంతేకాకుండా ఇది సాధారణ షూలతో పోలిస్తే 15 శాతం తేలికగా ఉంటుందనీ, పైగా చౌక కూడా అనీ అంటోంది అడిడాస్. న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన బయోఫ్యాబ్రికేట్ సదస్సులో ఈ సరికొత్త కాలిజోళ్లను అడిడాస్ అందరికీ పరిచయం చేసింది. అయితే ఎప్పుడు ఉత్పత్తి చేయడం మొదలుపెడతారు? ఖరీదు ఎంత ఉంటుంది? అన్నదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.