
మెక్సికో : పిట్ట కుంచెం కూత ఘనం అని అంటాం. కానీ పిట్ట కొంచెం మెదడు ఘనం అని కూడా ఇక అనవచ్చు. సాధారణంగా మనకు తెలిసిన పలు రకాల పిట్టలు చెట్టు కొమ్మలను, ఆకులను ఆసరాగా చేసుకొని గూళ్లు కట్టుకుంటాయని తెలుసు. వాటి కోసం అవి రక రకాల పుల్లలు, కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, కేబుల్ వైర్ల ముక్కలు ఏరుకొని వస్తాయి. వాటన్నింటిని కలిపి అవి గూళ్లు అల్లుకుంటాయి. గడ్డి పోచలతో ఆ గూడికి ఓ రూపాన్ని తీసుకొస్తాయి. ఇదంతా పిట్టలు తాము పెట్టే గుడ్లకోసం, పొదిగినప్పుడు ఆ గుడ్లు పిల్లలుగా పుట్టేంత వేడి ఉండడం కోసం.
పలు రకాల పిట్టలు తాము గూళ్ల కట్టుకోవడంలో మానవులు తాగి పడేసే సిగరెట్ పీకలను ప్రధానంగా పట్టుకెళతాయి. అన్ని పుల్లల్లాగా సిగరెట్ పీకలను పట్టుకెళుతున్నాయని చూసిన సాధారణ మనుషులు అనుకున్నారు. ఆ పీకల ఫిల్టర్‌లో ఉన్న దూది గూడు అల్లికకు బాగా పనికొస్తుందన్న ఉద్దేశంతో పీకలను పిట్టలు పట్టుకెళుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పిట్టలు పీకలను గూడు కోసం పట్టుకెళ్లడం వెనక ఇంతకన్నా పెద్ద కారణమే ఉందని నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోకు చెందిన డాక్టర్ సౌరెజ్ రోడ్రిగెజ్ కనుగొన్నారు.
రక్తాన్ని పీల్చే పరాన్నబుక్కులైన పేళ్ల లాంటి చిన్న చిన్న కీటకాలు గూళ్లలోకి ప్రవేశించకుండా, తమ పిల్లలకు హాని చేయకుండా ఉండేందుకే పిట్టలు ఈ ఫిల్టర్ దూదిని ఉపయోగిస్తున్నాయని డాక్టర్ నిరూపించారు. సిగరెట్టు పీకలు దొరకగనా లేదా అప్పటి అవసరం లేదనుకొనిగా పీకలు ఉపయోగించకుండా కట్టిన గూళ్లను కూడా ఆ తర్వాత పిట్టలు గుడ్లను పొదిగే సమయంలో మార్చుకున్న వైనాన్ని డాక్టర్ గుర్తించారు. గూళ్ల సాధారణ లైనింగ్‌ను తొలగించి ఫిల్టర్ దూది లైనింగ్‌ను కొత్తగా ఏర్పాటు చేసుకోవడాన్ని గమనించారు. సూక్ష్మ క్రిమికీటకాలు ఫిల్టర్ దూది జోలికి రాకపోవడాన్ని కూడా గుర్తించారు. డాక్టర్ తన ప్రయోగం పూర్తి వివరాలను ‘ఏవియన్ బయోలోజి’ తాజా సంచికలో ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment