ఆ దాడి నేనే చేశా..క్షమించండి!
బోస్టాన్: గత రెండు సంవత్సరాల క్రితం మతపరమైన విద్వేషంతో అమెరికాలోని రోస్ ప్రాంతంలో బాంబు దాడికి పాల్పడి అనేకమంది జీవితాల్లో చీకటి నింపిన ఘటనకు సంబంధించి నిందితుడిగా ఉన్న జోఖార్ సార్నావ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. సుమారు రెండు సంవత్సరాల పాటు నిశ్శబ్ధ యుద్ధం దాల్చిన సార్నావ్ ... వణికిన పెదాలతో ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకున్నాడు. అది తాను చేసిన పెద్ద తప్పిదంగా కోర్టు ఎదుట తన మనసులో భారాన్ని వెళ్లగక్కాడు. విచారణ నిమిత్తం బుధవారం కోర్టుకు హాజరైన జోఖార్ ఆ విధ్వంసానికి తానే కారకుడనని ఆవేదన వ్యక్తం చేశాడు.
'నన్ను క్షమించండి. మతపరమైన విద్వేషంతో బాంబు దాడికి పాల్పడ్డా. కొంతమంది జీవితాల్లో పూడ్చలేని లోటుకు నేనే కారణం'అంటూ తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో అతనికి మరణశిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. పాపపు కర్మలు చేసే మనుషులు మంచిని సమాధి చేశారనడానికి ఇదొక నిదర్శమని ఈ సందర్భంగా జడ్జి పేర్కొన్నారు.
2013 ఏప్రిల్ 15వ తేదీన జోఖార్ సార్నావ్ తన సోదరుడు తమేర్లాన్ తో కలిసి రెండు ప్రెషర్ కుక్కర్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, 17 మందికి తమ అవయవాలను కోల్పోయారు. ఆ సమయంలో పోలీసుల జరిపిన ఎదురు దాడుల్లో తమేర్లాన్ మరణించగా సార్నావ్ ప్రాణాలతో చిక్కాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ న్యాయాధికారి ఇటీవలే అసువులు బాశాడు.