కొత్త అధ్యక్షుడిని చంపితే.. 7 కోట్లిస్తాం!
ఫిలిప్పీన్స్ దేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్‌ను హత్యచేస్తే దాదాపు రూ. 7.25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నేరస్తులు, డ్రగ్ డీలర్ల మీద యుద్ధం ప్రకటించడంతో డ్రగ్స్ మాఫియా ఈ రకంగా బెదిరిస్తోంది. ఫిలిప్పీన్స్‌కు కొత్తగా ఎన్నికైన పోలీస్ చీఫ్ రోనాల్డ్ డెలా రోసా ఈ విషయం వెల్లడించారు. కొత్త అధ్యక్షుడిని చంపితే 5 కోట్ల పెసోలు (దాదాపు రూ. 7.25 కోట్లు) ఇస్తామంటూ మాఫియా ప్రకటించిందని ఆయన తెలిపారు. మొదట్లో కోటిన్నర రూపాయలే ఆఫర్ చేసినా, తర్వాత ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారట.
తాను పాలనాపగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లో నేరాలు, డ్రగ్స్ మాఫియాను ఫిలిప్పీన్స్ నుంచి ఏరిపారేస్తానని కొత్త అధ్యక్షుడు డుటెర్ట్ ప్రకటించారు. డ్రగ్ డీలర్లను ఎవరైనా చంపేస్తే, వాళ్లకు తగినంతగా నగదు బహుమతులు కూడా ఇస్తామన్నారు. ఎవరైనా ప్రముఖ డ్రగ్ వ్యాపారిని హతమారిస్తే కనీసం అర కోటి వరకు బహుమతి ఇస్తామని చెప్పారు. ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమేస్తే మనం బాగుంటామని, డ్రగ్స్ వ్యాపారులు దేశం వదిలిపోవాలని అన్నారు. దాంతో ఆయనను హతమార్చేందుకు డ్రగ్స్ వ్యాపారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.