అమెరికా: ఫ్లోరిడాకు చెందిన టెకారా తన కుటుంబంతో కలిసి గ్రాండ్ బహామాలోని ఫ్రీపోర్ట్‌ను సందర్శించడానికి వెళ్లారు. అదే సమయంలో డోరియా తుఫాను వారు వెళ్లిన ప్రదేశాన్ని చుట్టుముట్టింది. దీంతో ఇక భూమిపై నూకలు చెల్లినట్టే అని భయపడిపోయినప్పటికీ ఎలాగోలా తుపాను బారి నుంచి వారంతా తప్పించుకున్నారు. విలువైన వస్తువులు పోయాయే తప్ప కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత తొలిసారిగా సోమవారం టెకారా తన కుమారుడు మకై సిమోన్స్‌ను స్కూలుకు తీసుకెళ్లింది. అక్కడ తోటి విద్యార్థులు మకైపై కురిపించిన ప్రేమకు ఆ తల్లికి నోటమాట రాలేదు. డోరియా తుపాను నుంచి మకై క్షేమంగా బయటపడటంతో మిగతా పిల్లలందరూ పరుగున వచ్చి మకైను హత్తుకున్నారు.
అతనేమయ్యాడో అని బెంగ పెట్టుకున్న అతని ఫ్రెండ్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్నేహితులు అందరూ అతన్ని ఎంతో మిస్ అయ్యాం అని చెప్పడంతో వారి ప్రేమకు మకై కన్నీరు పెట్టుకున్నాడు. ఈ భావోద్వేగ క్షణాలను అక్కడే ఉన్న అతని తల్లి టెకరా కాప్రన్ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘తుపానును ఎదుర్కొన్న తర్వాత మొదటిసారి నా కొడుకుని స్కూల్‌కు తీసుకెళ్లాను. అక్కడ అతని స్నేహితులు వాడిపై కురిపించిన ప్రేమ అందరి మనసులను దోచింది.’ అని క్యాప్షన్‌ను జోడించింది. మకైను ‘అందరూ ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు, అండగా నిలిచారు. ఒక తల్లిగా నాకు ఇది చాలు’ అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment