యూకేపై భారత్ తీవ్ర వ్యాఖ్యలు
లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ ఆశ్రయం కల్పిస్తుండటంపై భారత్ తీవ్రంగా స్పందించింది. నేరస్తుల పాలిట స్వర‍్గంలా బ్రిటన్ తయారైందని ఆ దేశంలో భారత రాయబారి వైకే సిన్హా వ్యాఖ్యానించారు. మంగళవారం లండన్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిన్హా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ మేరకు పరోక్ష ఆరోపణలు చేశారు. ఇండియా వ్యతిరేకులకు, నేరస్తులకు వేదికగా యూకే మారిందని తెలిపారు.
‘మాది కూడా ప్రజాస్వామ్య దేశమే. అయితే, మేం మాత్రం ఇక్కడి మాదిరిగా స్నేహితులకు, సన్నిహితులకు ఇబ్బందులు కలిగే చర్యలను తలపెట్టలేం.. బ్రిటన్ ప్రభుత్వ తీరుపై మా దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని’ అన్నారు. అలాగే, బ్రిటన్ పార్లమెంట్‌లో కూడా ఇండియా వ్యతిరేక చర్చలు జరగటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇండియా- యూకే సంబంధాలపై ఇలాంటి చర్యలు ప్రభావితం కలిగిస్తాయన్నారు.
బ్రిటన్ మీడియా ఈ విషయంలో మరింత స్పష్టత తెచ్చుకోవాల్సి ఉందని, ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఇండియాకు ఉన్న ప్రముఖ స్థానాన్ని గుర్తించాలన్నారు. ఇండియాలోని బ్యాంకులను రూ.9వేల కోట్ల మేర మోసం చేసి పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు.