YK Sinha
-
సీఐసీ పోస్టుకు 76 దరఖాస్తులు
న్యూఢిల్లీ: ముఖ్య సమాచార కమిషనర్(సీఐసీ) పదవిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహా్వనించగా, ఇప్పటిదాకా 76 దరఖాస్తులు వచ్చాయి. సీఐసీ వైకే సిన్హా పదవీ కాలం మంగళవారం ముగిసింది. ఈ పోస్టు కోసం ముగ్గురు సమాచార కమిషనర్లు హీరాలాల్ సమారియా, సరోజ్ పున్హానీ, ఉదయ్ మహూర్కర్ పోటీ పడుతున్నారు. మాజీ సమాచార కమిషనర్ అమిత్ పాండోవ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. -
యూకేపై భారత్ తీవ్ర వ్యాఖ్యలు
లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ ఆశ్రయం కల్పిస్తుండటంపై భారత్ తీవ్రంగా స్పందించింది. నేరస్తుల పాలిట స్వర్గంలా బ్రిటన్ తయారైందని ఆ దేశంలో భారత రాయబారి వైకే సిన్హా వ్యాఖ్యానించారు. మంగళవారం లండన్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిన్హా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ మేరకు పరోక్ష ఆరోపణలు చేశారు. ఇండియా వ్యతిరేకులకు, నేరస్తులకు వేదికగా యూకే మారిందని తెలిపారు. ‘మాది కూడా ప్రజాస్వామ్య దేశమే. అయితే, మేం మాత్రం ఇక్కడి మాదిరిగా స్నేహితులకు, సన్నిహితులకు ఇబ్బందులు కలిగే చర్యలను తలపెట్టలేం.. బ్రిటన్ ప్రభుత్వ తీరుపై మా దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని’ అన్నారు. అలాగే, బ్రిటన్ పార్లమెంట్లో కూడా ఇండియా వ్యతిరేక చర్చలు జరగటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇండియా- యూకే సంబంధాలపై ఇలాంటి చర్యలు ప్రభావితం కలిగిస్తాయన్నారు. బ్రిటన్ మీడియా ఈ విషయంలో మరింత స్పష్టత తెచ్చుకోవాల్సి ఉందని, ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఇండియాకు ఉన్న ప్రముఖ స్థానాన్ని గుర్తించాలన్నారు. ఇండియాలోని బ్యాంకులను రూ.9వేల కోట్ల మేర మోసం చేసి పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఆస్ట్రేలియా వైపు.. భారత విద్యార్థుల చూపు!
లండన్: విదేశీ విద్య కోసం బ్రిటన్‌కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందా..? భారతీయ విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదవడానికే ఇష్టపడుతున్నారా..? దీనికి సమాధానం అవుననే అంటున్నారు బ్రిటన్‌లో భారత రాయబారి వైకే సిన్హా. బ్రిటన్‌లో వీసా నిబంధనలు కఠినంగా ఉన్నాయని అందుకే ఇక్కడ చదువుకునే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని మిగతా దేశాల్లో వీసా నిబంధనలు సరళతరంగా ఉండటంతో ఆ దేశాల్లో చదువుకోవడానికే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. 2010లో బ్రిటన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 40 వేలు ఉండగా, ప్రస్తుతం 19 వేలకు పడిపోయిందని వెల్లడించారు. ఇదే 2010లో అమెరికాలో లక్ష మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రస్తుతం లక్ష 66 వేలకు పెరిగిందని వివరించారు. ఆస్ట్రేలియాలో 2010లో 19 వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 40 వేలకు ఎగబాకిందని చెప్పారు. ప్రస్తుతం వీసా నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరించాలని ఆయన బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటన్‌లో చాలా విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికే ఆసక్తి చూపుతున్నాయని, కాని బ్రిటన్ ప్రభుత్వ వీసా నిబంధనల వల్ల విద్యార్థులు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నారని స్పష్టం చేశారు. వీసా నిబంధనలపై భారత్, బ్రిటన్ ప్రభుత్వాలు చర్చించాలని సూచించారు.