ఆస్ట్రేలియా వైపు.. భారత విద్యార్థుల చూపు!
లండన్: విదేశీ విద్య కోసం బ్రిటన్‌కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందా..? భారతీయ విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదవడానికే ఇష్టపడుతున్నారా..? దీనికి సమాధానం అవుననే అంటున్నారు బ్రిటన్‌లో భారత రాయబారి వైకే సిన్హా. బ్రిటన్‌లో వీసా నిబంధనలు కఠినంగా ఉన్నాయని అందుకే ఇక్కడ చదువుకునే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని మిగతా దేశాల్లో వీసా నిబంధనలు సరళతరంగా ఉండటంతో ఆ దేశాల్లో చదువుకోవడానికే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. 2010లో బ్రిటన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 40 వేలు ఉండగా, ప్రస్తుతం 19 వేలకు పడిపోయిందని వెల్లడించారు. ఇదే 2010లో అమెరికాలో లక్ష మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రస్తుతం లక్ష 66 వేలకు పెరిగిందని వివరించారు. ఆస్ట్రేలియాలో 2010లో 19 వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 40 వేలకు ఎగబాకిందని చెప్పారు.
ప్రస్తుతం వీసా నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరించాలని ఆయన బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటన్‌లో చాలా విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికే ఆసక్తి చూపుతున్నాయని, కాని బ్రిటన్ ప్రభుత్వ వీసా నిబంధనల వల్ల విద్యార్థులు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నారని స్పష్టం చేశారు. వీసా నిబంధనలపై భారత్, బ్రిటన్ ప్రభుత్వాలు చర్చించాలని సూచించారు.