బ్రూనైలో క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు
బ్రూనై: దేశంలో క్రిస్మస్ వేడుకలపై బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా కఠిన ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలతో పాటు ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించే చట్టాన్ని తీసుకొచ్చారు. క్రైస్తవులు బహిరంగంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోరాదని, క్రిస్మస్ చెట్లను ఏర్పాటుచేయడం, మతపరమైన పాటలు పాడడం, క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పుకోవడం లాంటి చర్యలన్నింటినీ నిషేధిస్తున్నట్లు బ్రూనై మత విశ్వాసాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లింలు ఎవరూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనరాదని, అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తామని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్ రోజు సెలవుదినం కాబట్టి, క్రైస్తవులు తమ కమ్యూనిటీ మధ్యనే వేడుకలు జరుపుకోవాలని సూచించింది.
అమెరికాలోఉన్న తన 'బెవర్లీ హిల్స్ హోటల్, హోటల్ బెల్ ఎయిర్'లకు చెందిన హోటళ్ల చైన్ అన్నింటిలో కూడా క్రిస్మస్ వేడుకలను ఈ ఏడాది నుంచి బ్రూనై సుల్తాన్ నిషేధించారు. సుల్తాన్ ఆదేశాలను కచ్చితంగా ఆచరించాలని ఇమామ్‌లు కూడా తమ అనుచరులను ఆదేశించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన చిట్టి దేశంగా గుర్తింపు పొందిన బ్రూనైలో ముస్లింలు దాదాపు 80 శాతం ఉండగా, మిగతా 20 శాతంలో క్రైస్తవులు, బౌద్ధులు ఉన్నారు.
దాదాపు నాలుగున్నర లక్షల జనాభా కలిగిన బ్రూనై ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చమురు, సహజవాయువు వనరులపైనే ఆధారపడి ఉంది. వీటిపై కుప్పతెప్పలుగా డబ్బు వచ్చిపడుతున్న కారణంగా సుల్తాన్ ప్రజలపై ఎలాంటి పన్నుల భారాన్ని మోపలేదు. దీనివల్ల సుల్తాన్ విలాసవంతమైన జీవితాన్ని కూడా ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన ప్యాలెస్‌లో 1788 గదులు, 350 టాయ్‌లెట్స్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, 110 కార్లకు గ్యారేజీలు ఉన్నాయి.
బ్రూనైలో ఇప్పటికే కఠినమైన ఇస్లాం చట్టాలు అమల్లో ఉండగా, 2014 మే నెల నుంచి షరియా మొదటి దశ చట్టాలను, 2015, మే నెలలో షరియా రెండో దశ చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల కింద ఇస్లాం మినహా ఇతర మతాల గురించి ప్రచారం చేయరాదు. ముస్లింలు మద్యం సేవించరాదు. ప్రజలెవరూ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం సేవించరాదు. పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉండకూడదు. వివాహేతర సంబంధాలు కలిగి ఉండరాదు. దొంగతనం లాంటి నేరాలు చేయకూడదు. ఇందులో ఏ నేరానికి పాల్పడినా.. చేతులు, కాళ్లు నరికేయడం లాంటి కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెల నుంచి రాళ్లతో కొట్టి చంపడం, తలలు తెగ నరకడం లాంటి శిక్షలను కూడా అమలు చేస్తామని 68 ఏళ్ల సుల్తాన్ బోల్కియా ఇదివరకే ప్రకటించారు. అయితే సుల్తాన్ తమ్ముడు ప్రిన్స్ జెఫ్రీ మాత్రం 'ప్లే బాయ్'గా గుర్తింపు పొందిన శృంగార పురుషుడు. ఆయనకు అత్యంత ఖరైదీన భారీ క్రూయిజ్ షిప్ కూడా ఉంది. అందులో తన సరదాలు తీర్చుకుంటాడని అంటారు.