
2022 నుంచి గంటకు వెయ్యిరూపాయల జీతం!
లాస్ ఎంజెల్స్: అమెరికాలోని కాలిఫోర్నియాలో పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాలు అమాంతం పెరగనున్నాయి. గంటకు కనీసం చెల్లించాల్సిన మొత్తాన్ని పదిహేను డాలర్లు చెల్లించాలని నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీలో గంటకు రూ.994 అన్నమాట. అంటే ఇంచుమించూ వెయ్యి రూపాయలు. దీనిని 2022 నుంచి అమలు చేయాలని చట్ట ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం కాలిఫోర్నియాలో గంటకు పది డాలర్లు చెల్లిస్తున్నారు. మస్సాచుస్సెట్స్లో కూడా ఇంతే మొత్తం చెల్లిస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా మొత్తంలో కూడా అత్యధిక జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లిస్తున్న రాష్ట్రాలు కూడా ఇవే కావడం విశేషం. ఈ బిల్లును గురువారం రాష్ట్ర సెనేట్లో ప్రవేశ పెట్టగా 26మంది అనుకూలంగా ఓటెయ్యగా.. 12 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు చట్టంగా ఏప్రిల్ 4న గవర్నర్ సంతకంతో రూపొందనుంది.