
భవనాలపై ఎద్దులు పరుగెడుతున్నాయా అన్నట్లు..
మేరీలాండ్: పంచభూతాలు శాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. వాటి పని అవి చేసుకుంటూ పోతుంటూనే బాగుంటుంది. ఎప్పుడైనా వాటికి కోపం వచ్చిందో తట్టుకోవడం ఎవ్వరితరం కాదు.. అది తీసుకొచ్చే నష్టం, చూపించే దృశ్యాలు భ్రమలు కలిగించే వెండితెరను కూడా మైమరపిస్తాయి. అంతటి భీభత్సాన్ని సృష్టిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు ప్రకృతిముందు తలవంచాలి అంటారు. మరీ అలాంటి ప్రకృతికి అమెరికాలో బాగా కోపం వచ్చింది. ఎంతలా అంటే పెద్ద చెట్లు వాటంతటవే వేర్లతో సహా పెకలింపునకు గురై గాల్లో చిత్తుకాగితాల మాదిరిగా తేలేలా.. రోడ్డుపై నిలిపిన కార్లు జాతరలో కొన్న ప్లాస్టిక్ బొమ్మకార్ల మాదిరిగా కొట్టుకుపోయేలా. అమెరికాలోని మేరీలాండ్‌లో ఈ దృశ్యాలు చోటు చేసుకున్నాయి.
అనూహ్యంగా వచ్చిన భీకరగాలితో కలగలిసిన తుఫాను ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లో భవనాలను ఒక కుదుపుకుదపగా చెట్లన్ని విరిగి పోయేలాగా, రోడ్డుపై నిలిపిన కార్లన్నీ అక్కడి నుంచి పల్టీలు కొడుతూ మైదాన ప్రాంతాల్లోకి వెళ్లేలా చేసింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీటికి సంబంధించిన దృశ్యాలు అమ్మో అనిపిస్తున్నాయి. గాలి దూసుకెళుతుంటే భారీ ఎద్దులు ఆవేశంతో భవనాల పైనుంచి హోరెత్తేలా తమ గిట్టలతో బలంగా శబ్దం చేస్తూ పరుగెడుతున్నాయా అన్నట్లుగా ఉందంటూ స్వయంగా దాన్ని ఎదుర్కొన్నవారు చెబుతున్నారు.