భారత్‌లో పనిచేసిన గూఢచారికి వందేళ్లు
వాషింగ్టన్: రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికా తరఫున గూఢచారిగా భారత్‌లో పనిచేసి, అసత్య వార్తాకథనాలతో జపాన్ సేనలను తప్పుదోవ పట్టించిన ఎలిజబెత్ బెట్టీ మెకింతోష్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. అమెరికాకు విశేష సేవలిందించినందుకు గాను బెట్టీ వందో జన్మదినాన్ని మంగళవారం సీఐఏ ప్రధానకార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పాత్రికేయురాలైన బెట్టీ 1943 నుంచి కొన్నేళ్ల పాటు భారత్‌లో ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో సీఐఏ పూర్వ సంస్థ ఓఎస్‌ఎస్‌లో చేరిన బెట్టీ.. జపాన్ బలగాలు ఓడిపోయి పారిపోతున్నాయని, అమెరికా సేనలు విజృంభిస్తున్నాయంటూ అసత్య వార్తాకథనాలు వండివార్చేవారు.
ఇంఫాల్ వద్ద జరిగిన పోరులో జపాన్ సేనలు వెనక్కి వెళ్లేందుకు ఈమె గూఢచర్యమూ కారణమైందని విశ్లేషకులు భావిస్తారు. జపాన్ నుంచి అధికారిక పత్రాలను సైన్యానికి మోసుకొచ్చిన కొరియర్‌ను చంపించి, ఆ కొరియర్ సంచిలో ఫోర్జరీ చేసిన పత్రాలను ఉంచడం ద్వారా.. అమెరికా సేనలకు దొరకరాదని జపాన్ ప్రభుత్వం ఆదేశించినట్లు సైనికులు భ్రమపడేలా చేసినట్లు ఈమెను ప్రశంసిస్తారు.