వాషింగ్టన్: విప్లవ వేగుచుక్క చే గువేరా గురించి ప్రపంచమంతా తెలుసు. చే ప్రసంగాలు, అతని ఆలోచనలు యువతరానికి ఇప్పటికీ ఆదర్శప్రాయమే. అర్జెంటీనాలో చే గువేరా జన్మించిన ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం వార్తల్లో నిలిచింది. 1928లో అర్జెంటీనాలోని రోసారియోలో నియో క్లాసికల్ అనే భవనంలో చే గువేరా జన్మించాడు. ఈ భవనాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. 2002లో ఫ్రాన్సిస్కో ఫరూగియా ఈ భవనాన్నికొనుగోలు చేశాడు. 240 చదరపుమీటర్ల అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనాన్ని అతడు సాంస్కృతిక నిలయంగా మార్చుదామనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఇప్పుడు దీన్ని అమ్మివేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ధర మాత్రం వెల్లడించలేదు. ఇక ఉర్కిజా, ఎంటర్ రియాస్ మధ్య ఉన్న ఈ భవనం ఏళ్ల తరబడి ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ వస్తోంది. (ఫేక్ ఫొటో: డిటెన్షన్ సెంటర్లో తల్లి..)
ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ పీపీ ముసికా దీన్ని సందర్శించిన లిస్టులో ఉన్నారు. చేతో కలిసి 1950లో దక్షిణ అమెరికా మొత్తాన్ని బైకుపై చుట్టివచ్చిన అల్బెర్టో గ్రెనడోస్ కూడా దీన్ని సందర్శించినవాడే. కాగా వృత్తిపరంగా డాక్టర్ అయిన చే గువేరా రచయిత, కవి, మేధావి, కమ్యూనిస్టు, సిద్ధాంతకర్త, మానవతావాది కూడా. దోపిడీ విధానాలను నిరసిస్తూ అతడు క్యూబా విప్లవంలో పాల్గొని ప్రాణాలకు తెగించి పోరాడాడు. అనంతరం ఫిడేల్ క్యాస్ట్రో ప్రభుత్వంలో క్యూబా మంత్రిగా పని చేశాడు. అయితే బొలీవియాలో పేదలకు అన్యాయం జరుగుతోందని పదవి వీడి మళ్లీ ఉద్యమం బాట పట్టాడు. ఈ క్రమంలో 1967 అక్టోబర్ 9న బొలివీయన్ దళాలు చేను చుట్టుముట్టి చంపేశాయి. అనంతరం ఆయన మృతదేహాన్ని ప్రపంచానికి కూడా చూపించలేదు. 1997లో అతని అవశేషాలు బయటపడగా క్యూబాకు తీసుకెళ్లి మరోసారి ఖననం చేశారు. (ఆనాటి స్ఫూర్తి ఎక్కడ.. నేడెక్కడ?)
Comments
Please login to add a commentAdd a comment