పిల్లలకూ ఐప్యాడ్స్ ఇష్టమే
న్యూయార్క్: నేటి తరంలో చిన్న పిల్లలు సైతం టెక్నాలజీని త్వరగా అందిపుచ్చుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఐపాడ్స్, ల్యాప్‌టాప్స్.. ఇలా దేని గురించైనా తెలుసుకోవడంలో ముందుంటున్నారు. సరిగ్గా మాట్లాడడం రాని పిల్లలు సైతం వీడియోగేమ్స్ అంటే ఇష్టపడుతున్నారు. ఏడాది వయసున్న చిన్నారులు సైతం ఐప్యాడ్స్ వినియోగించగలరని తాజా అధ్యయనం వెల్లడించింది. రెండేళ్ల వయస్సుకు చేరేలోపు ఐప్యాడ్ వినియోగంలో వారు మరింతగా ఆరితేరిపోతున్నారని కూడా యూనివర్సిటీ ఆఫ్ లోవా పరిశోధకులు తెలిపారు.
యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన చిన్నారులకు చెందిన అనేక వీడియోల్ని వారు విశ్లేషించారు. వారి పరిశీలన ప్రకారం ఏడాది వయసున్న చిన్నారుల్లో సగం మంది ఐపాడ్ వినియోగించగలిగితే, మరో ఏడాదిలోపు వీరిలో 90 శాతం మంది మాస్టర్స్ అనే స్థాయికి ఎదుగుతున్నారు. పరిశీలకులు విశ్లేషించిన వీడియోల్లో 12-17 నెలల వయసు పిల్లలు సాంకేతిక విషయంలో మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఈ పరిణామం భవిష్యత్‌లో చిన్నారుల చదువుల కోసం మంచి యాప్స్ రూపొందించేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.