ప్రస్తుతం చైనా పోలీసుల సగటు జీవిత కాలం ఎంతో తెలుసా? నలభైమూడున్నర సంవత్సరాలు. చైనా ప్రజల సగటు జీవిత కాలంలో ఇది సగం మాత్రమే. చైనాలోని ప్రతి ముగ్గురు పోలీసుల్లో ఒకరు ఉద్యోగనిర్వహణలో ఉండగానే చనిపోతున్నారట. నేరస్తులతో పోరాడి మరణించడం కాదు సుమా పని ఎక్కువై ఒత్తిడితో మరణిస్తున్నారు. ఇలా మితిమీరిన పని భారంతో మరణించిన పోలీసులు ఏదో వృద్ధాప్యంలో ఉండిఉంటారనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీరంతా 43 ఏళ్ళుకూడా నిండకుండానే అర్థాంతరంగా ఆయువు చాలిస్తున్నారు. అక్షరాలా చైనాలోని పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీ బాహాటంగా ప్రకటించిన విషయం.
గతేడాది 361 మంది చైనా భద్రతా సిబ్బంది విధినిర్వహణలో ఉండగానే చనిపోయారనీ. 246 మంది ఓవర్ వర్క్ కారణంగానే ప్రాణాలు కోల్పోయారనీ చైనా మంత్రివర్గం శుక్రవారం ప్రకటించింది. నలభైయేళ్ళు దాటీ దాటకుండానే చైనా పోలీసులు అర్థాంతరంగా చనిపోడానికి పని భారమే కారణమని తేల్చి చెప్పారు. కేవలం ఒకే ఒక్క ఏడాదిలోనే 361 మంది భద్రతా సిబ్బంది ఉద్యోగ నిర్వహణలో ఉండగానే చనిపోవడానికి పని ఒత్తిడీ, అధిక పనిగంటలూ కారణమట. చైనా పోలీసులు రోజుకి 13 నుంచి 15 గంటలు పనిచేస్తారని చైనా రక్షణ మంత్రిత్వ శాఖే స్వయంగా చేసిన సర్వేలో తేలిందట. ఇప్పుడు పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం మరణించిన వారి కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీనీ, ఇన్సూరెన్స్ ప్యాకేజీలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. సాంకేతి పరిజ్ఞానాన్ని అధికంగా వినియోగించుకోవడం ద్వారా పోలీసులపై పని ఒత్తడిని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment