ఈ ఆస్పత్రి వీడనంటే వీడను!
మనం ఎవరిమైనా ఏ కారణంగానైనా ఆస్పత్రిలో చేరితే వీలైనంత త్వరగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయేందుకు తాపత్రయ పడతాం. తహతహలాడుతాం. అందుకు త్వరగా కోలుకోవాలని కనిపించని దేవుళ్లందరిని పేరుపేరునా వేడుకుంటాం. ఈ ఆస్పత్రి వాతావరణం నుంచి బయటకు తీసుకెళ్లండి మహా ప్రభూ! అంటూ పరామర్శించేందుకు వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రాధేయపడతాం. కానీ చైనాకు చెందిన చెన్ (పూర్తి పేరు వెల్లడించలేదు) మాత్రం ఆస్పత్రి వర్గాలు డిశ్చార్జి చేసినా తాను మాత్రం ఆస్పత్రి వీడేది లేదంటూ మంకుపట్టు పట్టి దాదాపు మూడేళ్లపాటు ఆస్పత్రి మంచానికే అతుక్కుపోయాడు. ఆస్పత్రి వర్గాలు ఆతన్ని బలవంతంగా బయటికి పంపేంచేందుకు ప్రయత్నించగా తనను తాను మంచం రాడ్లకు ఇనుప గొలుసులతో తాళం వేసుకొని కూర్చున్నాడు. చివరకు చేసేది లేక ఆ ఆస్పత్రి యాజమాన్యం కోర్టుకెళ్లి చెన్‌ను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించేలా ఉత్తర్వులు తీసుకొచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు 2015, ఫిబ్రవరి 11వ తేదీన రంగప్రవేశం చేసి బలవంతంగా చెన్‌ను ఇంటికి చేర్చారు. ఆస్పత్రిని వీడేందుకు ఇష్టపడక భోరుభోరున ఏడుస్తూ వెళ్లిన చెన్ విచిత్ర కథనం ఇదీ..
55 ఏళ్ల చెన్ బీజింగ్ జిల్లాలోని మెంటావ్‌గౌ గ్రామానికి చెందినవాడు. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన చెన్ 2011, ఆగస్టులో బీజింగ్ జింగ్మీ గ్రూప్ ఆస్పత్రిలో చేరాడు. నెల రోజుల తర్వాత గాయాలు పూర్తిగా తగ్గాయని తేల్చిన వైద్యులు అతన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించారు. రెండు నెలల తర్వాత ఎడమ కాలులో నొప్పి వస్తోందంటూ మళ్లీ ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతని ఎడమకాలి రక్తనాళాల్లో కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టుకుపోవడాన్ని గుర్తించారు. వైద్యులు చికిత్సచేసి మూడు నెలల్లో ఇంటికి వెళ్లొచ్చని చెప్పారు. అయినా చెన్ మాత్రం తాను పూర్తిగా కోలుకోలేదంటూ ఆస్పత్రి వీడేందుకు ససేమిరా అన్నాడు. ఆ తర్వాత ఆస్పత్రి బిల్లులు కూడా చెల్లించకపోవడంతో 2012 , జూలై నుంచి ఆతనికి వైద్య సేవలను కూడా నిలిపేశారు. అప్పటికీ ఆస్పత్రి వదిలేందుకు చెన్ ఒప్పుకోలేదు. చివరకు అదే సమయంలో జరిగిన కుమారుడి పెళ్లికి కూడా వెళ్లలేదు. ఆస్పత్రి యాజమాన్యం కోర్టుకు వెళ్లడంతో చెన్ ఏమైనా మానసిన వ్యాధితో బాధ పడుతున్నారా అన్న కోణంలో కూడా కోర్టు వైద్య పరీక్షలు జరిపించి ఏమీ లేదని తేల్చింది. ఇంతకు చెన్‌కు ఆస్పత్రంటే అమిత ప్రేమా, ఇల్లంటే భయమా?