వెయ్యికోట్లతో కంపెనీ చైర్మన్ పరారీ
ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ అధినేత ఏకంగా వెయ్యికోట్ల వరకు పెట్టుబడిదారుల సొమ్ము తీసుకుని ఉడాయించేశాడు. అతగాడి ఆచూకీ కోసం చైనా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చైనాలోని హంగ్జూ నగరంలో వాంగ్జూ గ్రూప్ ఛైర్మన్ యాంగ్ వైగూ గత గురువారం నుంచి ఎవరికీ కనపడకుండా పోయాడు. దాంతోపాటు అప్పటివరకు ఆసంస్థలో ప్రజలు పెట్టుబడిగా పెట్టిన దాదాపు రూ. వెయ్యి కోట్ల సొమ్మును కూడా అతడు తీసుకుపోయాడు.
ఈ సంస్థలో నగదు నిల్వల విషయమై ఈనెల 18 నుంచే పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటన తర్వాత హంగ్జూ నగరంలోని తమ షాపింగ్ మాల్‌ను కూడా వాంగ్జూ గ్రూపు మూసేసింది. ఎలాగోలా పెట్టుబడిదారులకు వాళ్ల సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చేస్తామని కంపెనీ చెబుతోంది. వాంగ్జూ గ్రూపు వ్యాపారాలు విస్తృతంగా ఉన్నాయి. కామర్స్ , ఆటోమొబైల్స్, ఆస్పత్రులు, వెల్త్ మేనేజ్‌మెంట్.. ఇలా పలు కంపెనీలతో 70 నగరాల్లో 7వేల మంది ఉద్యోగులను ఆ కంపెనీ కలిగి ఉంది.