9/11 రహస్య నివేదిక: స్నేహితుల మధ్య చిచ్చు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో అత్యంత పాశవిక చర్యగా భావించే 9/11 దాడులపై ఆ దేశ నిఘా సంస్థ సీఐఏ తయారుచేసిన 'రహస్య' రిపోర్టుపై మళ్లీ వివాదం మొదలైంది. విమానాలను హైజాక్ చేసి,న్యూయార్క్ ట్విన్ టవర్లను పూర్తిగా, రక్షణ కేంద్రం పెంటగాన్ ను పాక్షికంగా ధ్వంసం చేసిన హైజాకర్లు 19 మందిలో 15 మంది సౌదీ అరేబియా జాతీయులే కావడం ఈ వివాదానికి కేంద్రబిందువు. హైజాకర్లకు సౌదీ ప్రభుత్వం సహకరించిందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వినవచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన సీఐఏ రిపోర్టు.. 9/11 దాడుల్లో సౌదీ పాత్ర ఏమిటనేది బయటపెట్టకపోగా, దానికి సంబంధించిన 28 పేజీలను రహస్యంగా ఉంచింది.
ఆ రహస్య పత్రాల వెల్లడితోపాటు, అంతర్జాతీయ న్యాయస్థానంలో సౌదీ అరేబియాపై కేసులు వేసేందుకు ఉపకరించే కీలక బిల్లు నేడో, రేపో ఆమోదం పొందనుంది. ఇప్పటికే అమెరికన్ సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు.. ప్రస్తుతం హౌస్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్ కు చేరింది. అక్కడ ఆమోదం లభిస్తే.. 9/11 బాధిత కుటుంబాల్లో ఎవరైనాసరే, సౌదీని కోర్టుకు ఈడ్చే అవకాశం ఉంటుంది.
అమెరికా చర్యలపై దాని మిత్రదేశమైన సౌదీ భగ్గుమంటోంది. తమ ప్రభుత్వంపై కేసులు పెట్టే వీలు కల్పించే బిల్లును నూటికినూరుపాళ్లు వ్యతిరేకిస్తున్నామని, ఇలాంటి చర్యలు ఇరుదేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సౌదీ విదేశాంగ శాఖ మంత్రి అమెరికాను హెచ్చరించారు. కాగా, నివేదికలోని 28 పేజీల రహస్య భాగంలో సౌదీని దోషిగా నిలిపే ఆధారాలేవీ లేవని సీఐఏ చీఫ్ జాన్ బ్రెన్నాన్ అంటున్నారు. సమగ్ర దర్యాప్తులో హైజాకర్లకు సౌదీ ప్రభుత్వం సహకరించినట్లు వెల్లడికాలేదని తెలిపారు.