ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం. సౌదీ అరేబియాలోని దమ్మమ్ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం విస్తీర్ణం 483 చదరపు కిలోమీటర్లు. అంటే ప్యారిస్ నగరం విస్తీర్ణానికి ఎనిమిది రెట్లు ఉంటుంది. ఇక్కడి నుంచి 37 విమానయాన సంస్థలు తమ విమానాలను నడుపుతున్నాయి. ఇవి తమ ప్రయాణికులను ఇక్కడి నుంచి 43 గమ్యాలకు చేరవేస్తున్నాయి.
విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం అతిపెద్దదే అయినా, ఇక్కడి నుంచి ఏటా రాకపోకలు జరిపే ప్రయాణికులు మాత్రం దాదాపు కోటి మంది మాత్రమే! దీనికంటే చిన్నదైన లండన్ హిత్రూ విమానాశ్రయం నుంచి ఏటా దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతుంటారు. సౌదీ అరేబియా ఇదివరకటి రాజు ఫాహద్ తన పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం 1999 నవంబర్ 28 నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది.
గల్ఫ్‌యుద్ధం జరిగినప్పుడు ఇది అమెరికన్ వైమానిక దళాలకు విమాన స్థావరంగా కూడా ఉపయోగపడింది. కళ్లు చెదిరే ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం విలాసవంతమైన వసతులు ఉన్నాయి. ఇందులోని పార్కింగ్ స్పేస్‌లో ఏకకాలంలో ఐదువేల కార్లు నిలిపి ఉంచడానికి తగిన సౌకర్యం ఉంది. విస్తీర్ణంలో అతిపెద్దదే అయినా, ప్రయాణికుల రద్దీలో మాత్రం ఈ విమానాశ్రయం వెనుకబడే ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment